BRS MLA Harish Rao Fires on Congress Party :కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి మాజీమంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన హరీశ్‌రావు, అధికార పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) క్వింటా వడ్లు 2,500 రూపాయలకు కొంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుందని ఆయన అన్నారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి 500 రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొంటామని చెప్పినట్లు గుర్తు చేశారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేసిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల నుంచి ఆడబిడ్డలకు రూ.10,000 బాకీ పడిందన్న ఆయన, అవి ఇచ్చిన తరువాతే ఓట్లు అడగాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీ ఉద్దర మాటలు తప్ప, ఉద్ధరించే పనులు చేయలేదు : హరీశ్ రావు - LOK SABHA ELECTIONS 2024
"గ్రామాల్లో రైతుల దగ్గరకు వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ, ఈ ఎన్నికల్లో రూ.2500కు క్వింటా వడ్లు కొంటేనే ఓటు అడిగే హక్కు ఉంటాది. లేకుంటే ఉండదనే విషయం చెప్పాలి. ఎన్నికలకు ముందు కొంటానని చెప్పి, అధికారంలోకి వచ్చాక మరిచారు. మీరు హామీ నెరవేర్చాకే ఊళ్లలోకి రావాలి, పార్లమెంట్ ఎన్నికల కోసం ఓట్లు అడగాలి. మహాలక్ష్మి పేరు మీద మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్నారు. మేనిఫెస్టోలోని మొదటి హామీనే తుంగలో తొక్కి మోసం చేశారు."-హరీశ్‌రావు, మాజీమంత్రి