BRS Leader Vinod Kumar Fires on BJP :నీట్ నుంచి తప్పుకొని, రాష్ట్రమే వైద్య విద్య ప్రవేశాలు నిర్వహించుకునేలా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. నీట్ కుంభకోణం దేశంలోనే పెద్దదని, రూ.కోట్లలో డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోందని ఆయన ఆరోపించారు.
ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే ఈ వ్యవహారాలన్నీ వెలుగు చూస్తున్నాయని వినోద్ కుమార్ మండిపడ్డారు. గొర్రెల పంపిణీలో అవినీతి జరిగితే ఈడీ వస్తే, 24 లక్షల మంది జీవితాలతో ఆటలాడిన వ్యవహారంలో ఈడీ ఎందుకు రావడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఈడీ ఏం చేస్తోందని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. కింగ్ పిన్ 20 ఏళ్ల నుంచి పేపర్ లీకేజీలో సిద్ద హస్తుడని కథనాలు వస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షా పత్రం లీక్ అయిందని బండి సంజయ్ ఆ రోజు నానా మాటలు మాట్లాడారన్న వినోద్ కుమార్, 24 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడిన బీజేపీ ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తుంది? ఎవరిని బర్తరఫ్ చేస్తారని వినోద్ కుమార్ నిలదీశారు.
మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. లీకేజీలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయోనని ప్రొఫెసర్లు, విద్యావేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఉత్తర భారతం వాళ్లు ర్యాంకులతో ఇక్కడకు వస్తున్నారని, కానీ అక్షరం ముక్క కూడా రావడం లేదని ప్రొఫెసర్లు చెప్తున్నారని వివరించారు.