BRS Leader Niranjan Reddy Comments on BJP and Congress :కేసీఆర్ మీద బురదజల్లడమే కాంగ్రెస్, బీజేపీ ఎజెండా తప్ప పదేళ్లలో తెలంగాణకు చేసిన మేలు గురించి ఒక్కసారి మాట్లాడడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ కోసం తమదైన ఎజెండా ప్రజల ముందు పెట్టి ఆమోదం కోరడం లేదన్నారు. తెలంగాణకు చేసిన మేలు గురించి చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేసీఆర్ విసిరిన సవాల్(KCR challenge Amit Shah)ను స్వీకరించకుండా తోక ముడిచారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల నుంచి బీజేపీ నేతలు, మోదీ, అమిత్ షా కేసీఆర్ మీద నిందలు మోపడం తప్ప ఒక్కటీ నిరూపించడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలనే చేర్చుకుని అభ్యర్థులుగా ప్రకటించే దుస్థితిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. మీరు అంత బలంగా ఉంటే అభ్యర్థులు ఎందుకు కరవయ్యారని ఎద్దేవా చేశారు. పార్టీని వీడుతున్న నేతల గురించి ప్రజాక్షేత్రంలో ప్రజలే తేలుస్తారని అన్నారు.
ఎందుకు బీజేపీ, కాంగ్రెస్కు ప్రజలు ఓట్లు వేయాలి : పొరపాటున కాంగ్రెస్, బీజేపీకు ఓటేస్తే మనకు మనం దహించుకున్నట్లే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు ఈ విషయంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ విపరీత హామీలు అమలు చేయాలని విపక్షంగా బీఆర్ఎస్(BRS Question to Congress) నిలదీయకుంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని అన్నారు. దౌర్జన్యంతో రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీల హక్కులను హరించేలా కాంగ్రెస్, బీజేపీ పని చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని, తెలంగాణను ఏ రంగంలో అగ్రభాగాన నిలిపారని కాంగ్రెస్, బీజేపీకు ప్రజలు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. అన్ని రంగాలను అధోగతి పాలు చేసినందుకు బీజేపీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయాలా అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.