BRS Leader Sridhar Reddy Murder in Wanaparthy : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో దారుణ హత్య చోటుచేసుకుంది. శ్రీధర్ రెడ్డి (45) అనే స్థానిక బీఆర్ఎస్ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. ఆరు బయట నిద్రిస్తున్న శ్రీధర్ రెడ్డిపై గొడ్డలితో దాడి చేయగా, తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
BRS Leaders Condemned Sridhar Reddy's Murder : ఇదిలా ఉండగా శ్రీధర్ రెడ్డి హత్యను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. హత్య దారుణమన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు హత్యకు గురి కావడం, పలుచోట్ల నేతలు, కార్యకర్తలపై దాడులు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు తావులేదని, ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని తెలిపారు. రాజకీయ ప్రేరేపిత హత్యపై తక్షణమే విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? ఇదేం దౌర్జన్యం - బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్టుపై కేటీఆర్ ఫైర్ - KTR Tweet On mannae Krishank Arrest
ప్రతిపక్షమే ఉండకూడదని పక్కా ప్లాన్ ప్రకారం : హత్యను ఖండించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఐదు నెలల్లో ఇది రెండో రాజకీయ ప్రేరేపిత హత్య అని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. హత్యపై బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో భారత రాష్ట్ర సమితి నాయకులపై పట్టపగలే దాడులు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, బీఆర్ఎస్ నేతల ప్రాణాలకు పెను ప్రమాదం పొంచి ఉందని డీజీపీకి ఫిర్యాదు చేసిన 10 రోజుల్లోనే శ్రీధర్ రెడ్డి చాలా దారుణంగా హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, ప్రతిపక్షమే ఉండకూడదని పక్కా ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం హత్యల సంస్కృతికి తెరలేపిందని మండిపడ్డారు.
వారి ప్రాణాలకు ముప్పు : ఇది ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలన అన్న ప్రవీణ్ కుమార్, మంత్రి అండదండలతో యథేచ్ఛగా జరుగుతున్న దాడుల్లో అధికార పార్టీ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, వారిపై పీడీ యాక్ట్ లాంటి చట్టాలను ప్రయోగించి జైల్లో పెట్టకపోవడం వల్లే ఇలాంటి వరుస హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులతో కుమ్మక్కవుతున్న కొందరు స్థానిక పోలీస్ అధికారులు ఎంతటి వారైనా సరే, వారిపై శాఖాపరమైన విచారణ జరిపి తప్పకుండా శిక్షించాలని, బదిలీ చేయాలని కోరారు. మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో వెంటనే కేంద్ర బలగాలు, స్పెషల్ పోలీసు బలగాలతో పికెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాణాలకు ముప్పున్న బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు వెంటనే రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
రైతుబంధు అంశాన్ని ప్రభుత్వం పరిహాసం చేస్తోంది : మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
గురుకుల నియామకాల్లో సరైన విధానం పాటించాలి - సీఎం రేవంత్‌రెడ్డికి ప్రవీణ్‌కుమార్ లేఖ