BRS Leader KTR Comments on CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దిల్లీ చక్కర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగర శివారులోని గోపన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయినా ప్రారంభించకపోవడాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. పనికిమాలిన ప్రభుత్వం, అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
నల్లగండ్ల, గోపన్‌పల్లి, తెల్లాపూర్, చందానగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గేలా, ఉపశమనం కల్గించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను చేపట్టి పూర్తి చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. పూర్తి అయిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కోసం వేచి చూస్తోందని తెలిపారు. ఫ్లైఓవర్‌ను ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు సీఎం రెడ్డి సమయం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఆయన దిల్లీ బాస్‌ల చుట్టూ చక్కర్లు కొట్టడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. ప్రజల కోసం గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. లేదంటే ప్రజలే ఆ ఫ్లైఓవర్‌ను ప్రారంభించే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.