Harish Rao Tweet on Telangana Junior Colleges: రాష్ట్ర సమస్యలపై నిత్యం తన వంతు గళం విప్పుతున్న నేతల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు ఒకరు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు తేడా చూపుతూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఒక్కోసారి క్షేత్ర పర్యటనలు చేస్తూ ప్రజల దగ్గరకు వెళుతున్నారు. మరోసారి సామాజిక మాధ్యమం ద్వారా లోపాలను చూపుతూ సర్కార్‌ను ప్రశ్నించారు. తాజాగా తన అధికార ఎక్స్ వేదికగా జూనియర్ కళాశాలల సమస్యలపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
Harish Rao onJunior Colleges Students Issue :రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై నేటికి 19 రోజులు అవుతున్నా ఇప్పటివరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా అందించకపోవడంపై హరీశ్‌రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్‌కి విద్య మీద, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 422 జూనియర్ కళాశాల్లో 1,60,000 మంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారని గుర్తు చేశారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం వైఫల్యమైందని ధ్వజమెత్తారు.