Harish Rao Sensational Comments on CM : సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ కాదు, చీట్ చాట్ చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా లేనివి ఉన్నట్లు చెప్పి మోసం చేశారని, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు అదానీకి అప్పగిస్తామని చెప్పిన సీఎం, అసెంబ్లీలో అడిగితే లేదని పేర్కొన్నారని గుర్తు చేశారు. అబద్ధాలను ప్రచారం చేయడానికి సీఎం చిట్చాట్లు వాడుకుంటున్నారని ఆక్షేపించారు. అలాగే రుణమాఫీ విషయంలో సీఎం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు.
'రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసిన గజదొంగ రేవంత్. రుణమాఫీ కాలేదని మీ మంత్రులు రోజూ చెప్తున్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నది నా సవాల్. చేశారా? రుణమాఫీ సవాల్ ఏమైందో రైతులే చెబుతారు. వ్యవసాయ మంత్రి లెక్కల ప్రకారమే 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. రైతులనే కాదు రాహుల్‌ను కూడా రేవంత్ మోసం చేశారు. రుణమాఫీ సభకు రావాలని సీఎం మూడుసార్లు ఆహ్వానించినా రాహుల్ రాలేదు.' అని హరీశ్‌రావు అన్నారు.
వాల్మీకి కుంభకోణం గురించి సీఎం ఎందుకు మాట్లాడరు :కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం గురించి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. తమపై సీఎం ఆరోపణలు చేస్తున్నారని, ఇద్దరం వెళ్లి ఈడీకి ఫిర్యాదు చేద్దామని సవాల్ చేశారు. వాల్మీకి కుంభకోణంపై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాబట్టే వాల్మీకి కుంభకోణంపై తెలంగాణలో దాడులు జరగడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై బీఆర్ఎస్ వదిలిపెట్టదు, ఈడీని కలిసి వాల్మీకి కుంభకోణంపై విచారణ చేయాలని అడుగుతామని పేర్కొన్నారు. సివిల్ సప్లైస్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ చేయాలని కోరారు.