Harish Rao Responds On CM Revanth Comments :కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరకొర రుణమాఫీ ఘనత తన పుణ్యమేనని మాజీమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రుణమాఫీ అయిందో లేదో సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ జరిగితే సురేందర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశ్నించారు. సిద్దిపేట వెంకటాపురం గ్రామంలో 82మంది రైతులకు రుణమాఫీ కాలేదని వివరాలు పంపిస్తానని మాఫీ చేయాలన్నారు.
రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశారని సీఎంను ఉద్దేశించి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్‌రావు, సీఎంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నాటి కేసీఆర్ సర్కార్ ముందుచూపుతో ఫార్మాసిటీకి సేకరించిన భూమిని రియల్‌ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ అంటూ రేవంత్ కొత్త రాగం ఎత్తుకున్నారని హరీశ్‌రావు ఆక్షేపించారు.
ఐదేళ్లకు మించి కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు : మరోసారి అధికారం తమదే అన్న సీఎం వ్యాఖ్యలపై, దేశంలో ఎక్కడచూసినా కాంగ్రెస్ ఒక్కసారి మాత్రమే అధికారంలో ఉంటుందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఐదేళ్లకే కాంగ్రెస్ సర్కార్ గద్దె దింపేశారని గుర్తు చేశారు. అదృష్టం కొద్దీ గెలిచిన రేవంత్‌రెడ్డి ఐదేళ్లు మాత్రమే పదవిలో ఉంటారని వ్యాఖ్యానించారు.
"ఈ అయిదేళ్ల కాలమే మీకు ఎక్కువ. మీ పరిపాలనలో ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు. మీ లక్ బాగుండి మీరు గెలిచారు, ఇప్పుడు ఐదేళ్లు మీరు సీఎంగా ఉంటారు. ఈ వ్యవధిలో మంచిగా పనులు చేయండి. మీకున్న అవకాశాలను జాగ్రత్తగా వినియోగిస్తే కాస్తయినా మంచిపేరు వస్తుంది. రెండోసారి గెలిస్తా అంటే కాంగ్రెస్‌కు అంత సీనులేదు. దేశంలో ఎక్కడైనా మీ పార్టీ ఒక్కసారికే పోతుంది."-హరీశ్‌రావు, బీఆర్ఎస్ సీనియర్ నేత