BRS Leader Harish Rao Fires on Government :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటాకు మించి కృష్ణా జలాలను వాడుకుంటోందని, రాష్ట్ర సాగు, తాగు నీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీమంత్రి హరీశ్ రావు ఆక్షేపించారు. సోయి లేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో అర్థం అవుతోందని, నీళ్ల మంత్రి నీళ్లు నములుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తెలంగాణ భూములకు నీరు పారిస్తే, కాంగ్రెస్ నీళ్లు నములుతోందని ఎద్దేవా చేశారు.
ఇష్టం వచ్చినట్లు జలదోపిడీ :సాగర్ కుడి కాల్వ నుంచి రోజూ పది వేల క్యూసెక్కులు మూడు నెలలుగా పోతున్నా పట్టించుకోవడం లేదన్న ఆయన తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్కు పట్టవా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం తెలంగాణకు పెనుశాపంగా మారిందని, కేంద్రాన్ని అడిగే ధైర్యం లేదు, ఏపీ సీఎం చంద్రబాబును అడిగే దమ్ము లేదని అన్నారు. ప్రతిపక్షాలను బాగా విమర్శిస్తారు కానీ, కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదని హరీశ్ రావు మండిపడ్డారు. నీటి తరలింపు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది కాబట్టే ఏపీ ఇష్టం వచ్చినట్లు నీటిని తరలించుకుపోతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేనందు వల్ల, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నందువల్ల నీటిని తరలించుకునేందుకు చంద్రబాబుకు సులువు అయిందని, ఇష్టం వచ్చినట్లు జలదోపిడీ జరుగుతున్నా ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు.
"రాష్ట్ర నీటి ప్రయోజనాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. తీవ్ర నష్టం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. 25 రోజుల్లోనే 65 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. కేంద్రాన్ని, ఏపీ సీఎం చంద్రబాబును అడిగే ధైర్యం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. కృష్ణా బోర్డు ముందు, దిల్లీలో ధర్నా చేద్దాం. మేమూ వస్తాం."-హరీశ్ రావు, బీఆర్ఎస్ నేత
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగలేదు :రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య పరోక్ష సంబంధం, గురు దక్షిణ చెల్లించుకుంటున్నారేమోనని, కేసీఆర్ ప్రతినిత్యం సమీక్ష చేసేవారని ఇప్పుడు సీఎం, మంత్రి కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఇప్పటికే నష్టపోయిందని, ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు. ఆరున్నర లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకున్నారని, సాగర్ ఎడమకాల్వకు ఇంకా నాలుగు తడులు కావాలని, హైదరాబాద్ సహా చాలా జిల్లాల తాగునీటి అవసరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఏపీకి నీరు ఆపేలా చూడాలన్న ఆయన కృష్ణా బోర్డు కార్యాలయం ముందు, దిల్లీలో ధర్నా చేద్దామని, తామూ వస్తామని హరీశ్ రావు తెలిపారు. సాగర్ కుడి కాల్వ, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు నుంచి నీరు వెళ్లకుండా అడ్డుకోవాలని అన్నారు. ఈ ఏడాది ఇవాళ్టి వరకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగలేదని, రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆక్షేపించారు.