BRS MLA Harish Rao Fires on Congress Party : ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా పారిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తామడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేక వాయిదా వేసి పారిపోయిందని దుయ్యబట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్‌రావు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఆర్టీసీ యూనియన్ను పునరుద్దరణ చేయడంలాంటి సమస్యలపై ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదని ఆరోపణాస్త్రాలు సంధించారు. అసెంబ్లీలో నిరుద్యోగులపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని పేర్కొన్నారు. ఊసరవెల్లి సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతుందని ఎద్దేవా చేశారు.
Harish Rao Fire on Congress Job Creation :అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా వాటి ఊసేలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులపై పోలీసులు లాఠీ చార్జీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులపై మాట్లాడే అవకాశం తమకివ్వలేదని విమర్శించారు. అధికారంలోకి రాకముందు గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులను పెంచుతామని, ఇప్పుడు సాధ్యం కాదనడం సమంజసం కాదన్నారు.
"ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచుతామని మాట ఇచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చాక సాధ్యంకాదని మాట్లాడుతున్నారు. గతంలో ఇదే రాష్ట్రంలో నోటిఫికేషన్ వచ్చిన తరవాత అనేక పరీక్షలకు పోస్టులు పెంచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగులు కొట్లాడతా ఉంటే, పోలీసులతో లాఠీచార్జ్ చేయిస్తున్నారు."-హరీశ్‌రావు, మాజీ మంత్రి