Harish Rao Participated BRS Formation Day Celebrations in Siddipet :తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. తనకు పదవులు ముఖ్యం కాదని రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
Harish Rao Comments on CM Revanth : అంతకుముందు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేటలో హరీశ్‌రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 2001 ఏప్రిల్ హైదరాబాద్‌లోని జలదృశ్యంతో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్థానం, నేడు దేశానికి ఆదర్శం అయిందని అన్నారు. పదవులకు రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని గుర్తు చేశారు. ఆనాడు రాజీనామా చేయకుండా ఉన్న వ్యక్తి కిషన్ రెడ్డి అని, మరోవైపు రాజీనామా కోసం జిరాక్స్ పేపర్ ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు విమర్శించారు.
తిట్లలో ఆదర్శంగా రేవంత్ రెడ్డి :కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే, రేవంత్‌రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని హరీశ్‌రావు విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాడు ఓటుకు నోటు, నేడు దేవుళ్లపైన ఒట్లని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖను ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి పంపించాలని, అలాగే తాను కూడా 5 నిమిషాల్లో రాజీనామా లేఖను పంపిస్తానని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.