BRS Key Meeting on April 18 in Telangana Bhavan : లోక్ సభ ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలపై చర్చించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న బస్సు యాత్ర రూట్ మ్యాప్‌పై చర్చించేందుకు గురువారం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొననున్నారు.
BRS Meeting on Parliament Elections 2024 : పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలతో పాటు ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ.95 లక్షల చెక్కును కేసీఆర్ అందించనున్నారు. ఆ తర్వాత నేతలతో జరగనున్న సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు. తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్
రైతులకు భరోసా : ఇటీవల జరిగిన బహిరంగ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన తరుణంలో తెలంగాణ ప్రజలకు మరింత చేరువ కావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు బీఆర్ఎస్ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరవుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి, వారి కష్టసుఖాలను తెలుసుకొని, వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. గురువారం నాటి సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌పై కూడా చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.