Harish Rao On Kaushik Gandhi Controversy :రాష్ట్రంలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం పొలిటికల్ హీట్‌ను రాజేసింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ పోలీసులు, ప్రభుత్వం వైఫల్యం చెందాయని, కౌశిక్ రెడ్డిపై ప్రభుత్వమే దాడి చేయించిందని ఆరోపించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సైబరాబాద్ సీపీ మాట్లాడితే అరెస్ట్ చేస్తామన్నారు, ఏం చేశారని నిలదీశారు. ఎస్కార్ట్ ఇచ్చి మరీ గాంధీని తీసుకొచ్చారని, ఇదేనా ప్రజాపాలన? అని ధ్వజమెత్తారు.
సిద్దిపేటలో నా కార్యాలయంపై దాడి చేశారు. ఖమ్మంలో మాపై దాడి విషయమై ఫిర్యాదు చేస్తే ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. గాంధీ వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి దాడి చేయించారు. గాంధీని ఇంట్లో హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఇది ప్రభుత్వ దాడి. శాంతి భద్రతలు కాపాడాలని అనుకుంటే, చట్టంపై నమ్మకం ఉంటే ఏసీపీ, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి. దీన్ని వదిలిపెట్టం. ఎంత దూరమైనా వెళ్తాం. - హరీశ్ రావు, మాజీ మంత్రి
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే పైనే దాడి జరిగితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇక ఏ కంపెనీలైనా ఆసక్తి చూపుతాయా అని నిలదీశారు. హైదరాబాద్‌లో ప్రజలకు రక్షణ లేదని, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని అన్నారు. రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారని అడిగారు.