Lagacharla Incident Main Accused Suresh Surrendered : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్న ఎ2 భోగమోని సురేశ్‌రాజ్ మంగళవారం కొడంగల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు నీరేటి సురేశ్ (ఎ-38), నీరేటి చిన్న హన్మంతు (ఎ-55)లను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శ్రీరామ్ వీరికి 14 రోజుల రిమాండ్ విధించగా, సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. కాగా జైలు నుంచి వచ్చిన తరువాత రైతుల పక్షాన పోరాడతానని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు సురేశ్‌రాజ్ స్థానిక విలేకరులతో అన్నాడు. ఇతను ఎక్కడి నుంచి వచ్చి లొంగిపోయాడనే విషయాన్ని పోలీసులు వెల్లడించ లేదు.
ఈ నెల 11న దుద్యాల గ్రామ సభలో జిల్లా కలెక్టర్ బృందం నిరీక్షిస్తుండగా, ఆ సమయంలో అక్కడికి వెళ్లిన సురేశ్ రాజ్ లగచర్లలో ప్రజలు అధికారుల కోసం నిరీక్షిస్తున్నారని నమ్మబలకడంతో ఆ గ్రామానికి అధికారుల బృందం వెళ్లింది. వెంటనే పలువురు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై ప్రధాన నిందితునిగా అభియోగం మోపి అరెస్టు చేశారు. సురేశ్ రాజ్ ప్రజలను రెచ్చగొట్టారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతను లొంగిపోవడంతో కేసు విచారణ వేగవంతం చేశారు.
నరేందర్ రెడ్డికి ఇంటి భోజనం : ఇదిలా ఉండగా జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డికి ఇంటి భోజనం అందించాలంటూ జైలు అధికారులకు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రత్యేక తరగతి ఖైదీగా గుర్తిస్తూ వైద్య సదుపాయాలతో పాటు అన్ని సౌకర్యాలను కల్పించాలంది. విచారణ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డికి ఇంటి భోజనం అందించే అవకాశం కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య పట్నం శ్రుతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, న్యాయవాది రవీందర్ వాదనలు వినిపిస్తూ 1979 జైలు నిబంధనల్లోని 730 ప్రకారం ప్రత్యేక తరగతి విచారణ ఖైదీగా ఇంటి భోజనం, పరుపు పొందే అవకాశం ఉందన్నారు. వైద్య సదుపాయం కల్పించేలా జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేయాలన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఇంటి భోజనం ద్వారా ఏవైనా జరిగితే అధికారులు జవాబుదారీ కాదంటూ విచారణ ఖైదీ నుంచి హామీ తీసుకుని భోజనం అందజేయాలన్నారు.
కొంతమంది చేసిన తప్పునకు ఊరంతా బలి - ప్రశాంతంగా ఉండే లగచర్లకు ఆరోజు ఏమైంది?
ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తారో అనే భయం - నిర్మానుష్యంగా మారిన ఆ 3 గ్రామాలు