Harish Rao Fires on Minister Uttam Comments : కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ జులైలో మేడిగడ్డ వద్ద సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని తెలిపినా, వరదలు రావటంతో టెస్ట్‌లు ఆపేసినట్లు ఉత్తమ్ తెలిపారన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని మాజీ మంత్రి తెలిపారు.
ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ 2023 అక్టోబర్ చివరలో హడావుడిగా ఎలాంటి పరిశీలన జరగకుండానే నివేదికనిచ్చారని విమర్శించారు. వానాకాలంలో వరదల నుంచి మేడిగడ్డ బ్యారేజీని రక్షించడానికి ఎన్డీఎస్‌ఏ ఇంజినీర్లు, ప్రభుత్వ పెద్దలు సలహాలు కోరినప్పటికీ, వారు ఎలాంటి రక్షణ చర్యలు సూచించకపోవటం విచిత్రంగా ఉందన్నారు.
వరదలు రాకముందే సరైన రక్షణ చర్యలు తీసుకోవాల్సింది : పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాతనే వారు తాత్కాలిక రక్షణా చర్యలు సూచిస్తూ మే నెలలో నివేదిక పంపారన్నారు. వరదలు రాకముందే బ్యారేజీకి సరైన రక్షణ చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం, ఎన్డీఎస్‌ఏ నివేదిక కోసం ఎదురు చూస్తూ 4 నెలల విలువైన కాలాన్ని వృథా చేసిందన్నారు. ఇప్పుడేమో వరదల కారణంగా పరీక్షలు ఆపివేశామని చెప్పడం బాధ్యతా రాహిత్యమని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ దోపిడీ విధానానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయింది : మంత్రి ఉత్తమ్ - Minister Uttam on Kaleshwaram Works
తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతామని ఉత్తమ్ కుమార్ అంటున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏ ఎత్తున ప్రాజెక్టును కడతారో మంత్రి ఉత్తమ్ వివరించాలన్నారు. 2013 సంవత్సరంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాసిన లేఖలోని అంశాలు ఉత్తమ్ మరొక్కసారి చదువుకోవాలని, వారు చేసిన సూచనలను దృష్టిలో ఉంచుకొని తుమ్మిడిహట్టి బ్యారేజిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పుకొచ్చారు.
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సాంకేతిక సమస్యలు : రీ ఇంజనీరింగ్ తర్వాత కూడా జలాశయాల నిల్వ సామర్థ్యం పెంచడం తప్ప ఎల్లంపల్లి నుంచి పైకి నీటిని తీసుకు వచ్చే అలైన్మెంట్ ఏ మార్పు లేదని, ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు అయినా, కాళేశ్వరం ప్రాజెక్టు అయినా రెండూ కూడా మల్టీ స్టేజ్ ఎత్తిపోతల పథకాలేనని, రెండింటిలో కరెంటు ఖర్చు దాదాపు సమానమేనన్నారు.
తుమ్మిడి హట్టి బ్యారేజీ నిర్మాణం పూర్తికి సమస్యలు ఉండటం వల్లే బీఆర్ఎస్ 148 మీటర్ల వద్ద ఒప్పందం ఉన్నప్పటికీ బ్యారేజీని నిర్మించలేకపోయామని, దానికి ప్రత్యామ్నాయంగా వార్ధా నదిపై బ్యారేజీని ప్రతిపాదించమని అన్నారు. ప్రాజెక్టుపై ఖర్చు రూ.94 వేల కోట్లు ఉంటే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం ఏమి నైతికత అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98 వేల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడం జరిగిందని హరీశ్ తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ విమర్శలు కట్టిపెట్టి, ప్రాజెక్టును పునర్వినియోగంలోకి తీసుకురావాలని హరీశ్‌రావు సూచించారు.
'15,000,000,000,000 - 15 పక్కన ఇన్ని సున్నాలా!! - మూసీ అభివృద్ధి వ్యూహం వెనక ఉద్దేశమేంటి' - KTR On Musi River Development
పెద్దవాగు గండికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం - ప్రాజెక్టు కొట్టుకుపోయినా మంత్రులకు తీరకలేదా? : హరీశ్ రావు - Harish Rao Tweet on Peddavagu