BRS Chief KCR Road Show At Mahabubabad :ఆరు గ్యారంటీలతో రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దగా చేస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. బోగస్ హామీలతో అధికార పీఠమెక్కి పథకాలను అమలు చేయకుండా తప్పించుకుంటోందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఇవాళ మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితకు మద్దతుగా కేసీఆర్ రోడ్‌షో నిర్వహించారు.
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటిని సక్రమంగా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనే దిక్కులేక రైతులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి ఉసురుపోసుకుంటుందని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది : కేసీఆర్
KCR Reacts on EC Notices : కాంగ్రెస్ పాలనలో గిరిజనులను గౌరవించలేదని, బీఆర్ఎస్ హయాంలో సేవాలాల్ భవన్ నిర్మించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై గిరిజనులు ప్రతాపం చూపించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం 48గంటలు పాటు తాను ప్రచారం చేయకుండా నిషేధం విధించడంపై స్పందించిన కేసీఆర్, లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు 96గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని స్పష్టం చేశారు.
"కేంద్ర ఎన్నికల సంఘం నాపై 48 గంటలపాటు నిషేధం విధించింది. ఎటువంటి ప్రచారాల్లో పాల్గోకూడదని, ఇంటర్వ్యూలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. ఇదే రేవంత్‌రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు పీకుతా అని నామీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఈసీ ఎటువంటి ఆకంక్షలు విధించలేదు. కానీ నాపై పెట్టింది. లక్షలాదిగా ఉన్న గులాబీ కార్యకర్తలకు నేను పిలుపిస్తున్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే, మా శ్రేణులంతా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తున్నాను."-కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
కాంగ్రెస్ ప్రభుత్వం తమను దగా చేసిందని ఓటర్లు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని కేసీఆర్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో పరిశీలించుకోవాలని ఆయన అన్నదాతలకు సూచించారు. మాయమాటలతో ఓట్లు వేయించుకొని ఓటర్లను మోసం చేసి హస్తం నేతలు అక్రమార్జనలకు తెరదీశారని ఆరోపించారు. దిల్లీకి కప్పం కట్టేందుకు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత లేదని, వారికి అధికార దాహం తప్ప ప్రజా సంక్షేమం పట్టదని మండిపడ్డారు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు కాంగ్రెస్ నేతల నైజం సాగుతోందని ఎద్దేవా చేశారు.
ఆరు గ్యారంటీల పేరిట తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది: కేసీఆర్ ఓవైపు బస్సుయాత్ర - మరోవైపు గులాబీ నేతలకు మార్గనిర్దేశం - బిజీబిజీగా కేసీఆర్