BRS Chief KCR Crops Inspection 2024 : సాగు నీరు అందక ఎండుతున్న పంటలను పరిశీలించేందుకు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఆదివారం క్షేత్రస్థాయిలో (KCR Visit 3 Districts) పర్యటించనున్నారు. ఎండిపోయిన పంటల పరిశీలన నిమిత్తం జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఉదయం ఎర్రవెల్లి నుంచి బయల్దేరి, 10.30 గంటలకు జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధారావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు.
అనంతరం ఉదయం 11.30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట గ్రామీణ మండలాల్లో పర్యటించి పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ మీడియా సమావేశం(KCR Press Meet) నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలంలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటారు. మూడు జిల్లాల పర్యటన అనంతరం కేసీఆర్ రాత్రికి తిరిగి ఎర్రవెల్లి చేరుకుంటారు.
కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్
Lok Sabha Election 2024 : దాదాపు నెల రోజుల తర్వాత బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. అంతకు ముందు నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్ ఆ తర్వాత ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటి వద్ద నుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ మారుతున్న నాయకులను తన ఇంటి వద్దకే పిలిపించుకుని మాట్లాడుతున్నారు.