BJP MP Candidate Etela Rajender Comments on Congress : కాంగ్రెస్ మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. ఒక పార్టీలో గెలిచి, ఇతర పార్టీల్లో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి, దానం నాగేందర్‌ను ఎలా పార్టీలోకి చేర్చుకున్నారని ప్రశ్నించారు. కడియం శ్రీహరి దళితుడే కాదని సీఎం రేవంత్ (CM Revanth reddy) అన్నారని, అలాంటప్పుడు ఆయన కుమార్తెకు ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారని నిలదీశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అధికారంలో లేనప్పుడు ఒక విధంగా, వచ్చాక మరోలా మాట్లాడుతున్నారని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
Etela Rajender on MP Elections :మల్కాజిగిరిలో బీజేపీ గెలుపు ఖాయమని, కేంద్రంలో 400 సీట్లు సాధిస్తామని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని, తెలంగాణ సర్కార్ దాని కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు. మల్కాజిగిరిలో అన్ని సంఘాల మద్దతు బీజేపీకే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర పార్టీలకు డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. ఇవాళ మల్కాజిగిరిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి నిధులు తీసుకొచ్చే సత్తా తనకు ఉందని ప్రజలు నమ్ముతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. మోదీ (PM Narendra Modi)కి హిందుత్వం అంటగట్టి ప్రయోజనం పొందడానికి ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ తీసివేయడంతో ముస్లిం మహిళలు కూడా ప్రధానికి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. నిబద్ధత కలిగి ఉన్న నాయకులు, కార్యకర్తలు బీజేపీలో ఉన్నారని, అందరూ కలిసికట్టుగా ఉండి విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.