MP Arvind on CM Revanth and KTR : గత ఎన్నికల్లో పసుపు బోర్డుపై హామీ ఇచ్చి సాధించానని, ఈసారి ఉద్యోగ అవకాశాలు పెంచడంపై దృష్టి పెడతామని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. గల్ఫ్ వలసలు నివారిస్తామని, వృత్తి శిక్షణ ఇస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ 10 అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ పేరుతో స్థానిక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే స్థానిక 10 హామీలను అమలు చేస్తామని పేర్కొన్నారు. గుజరాత్ మోడల్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా చెప్పారని అన్నారు. గుజరాత్ మోడల్‌కు విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ నిదర్శనమని తెలిపారు.
తెలంగాణ సర్కార్, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని అర్వింద్ మండిపడ్డారు. కొత్త రేషన్ కార్డ్‌లు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం ఇంకా ఇవ్వకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అంతకముందు ఆయన నిజామాబాద్ జిల్లా వేల్పూరులో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. జైశ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అంటున్న కేటీఆర్‌కు, ముస్లింల టోపీ నెత్తి మీద పెట్టుకుంటే కడుపు నిండుతుందా అని ప్రశ్నించారు.
MP Arvind on Hindu religion :దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి, మసీద్‌లో నుంచి వచ్చే శబ్దం మా చెవిలో ఎందుకు ఉండాలో సమాధానం చెప్పగలరా అని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సూక్తులన్ని హిందువులకు మాత్రమే చెబుతారని, మరో వర్గానికి ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, ఆ పార్టీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుకుంటే వెంటనే పడిపోతుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీకి ఓటేయాలనుకుంటున్నారని, పోలింగ్ అయిపోగానే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు. ముస్లింల ఓట్ల కోసం ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, మరి హిందువులవి ఓట్లు కావా అని ప్రశ్నించారు.