BJP Membership Drive in Telangana : బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ ఈ నెల 3న చేపట్టాల్సి ఉండగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా రాష్ట్ర నాయకత్వం వాయిదా వేసింది. తాజాగా నేటి నుంచి చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. సాయంత్రం నాలుగు గంటలకు సోమాజీగూడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇంఛార్జీలు, జాతీయ నాయకులు అర్వింద్ మీనన్, అభయ్ పాటిల్ హాజరుకానున్నారు.
9, 10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో మొదలుపెట్టనున్నారు. ఈ నెల 11 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా డ్రైవ్ కొనసాగనుంది. ప్రతి పోలింగ్ బూత్‌లో 200 మంది సభ్యత్వాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఆ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే చేపట్టనుంది. ఈనెల 25న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై రాష్ట్ర నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది.
అక్టోబరు 1 నుంచి క్రియాశీల సభ్యత్వ నమోదు : పార్టీ క్రియాశీల సభ్యత్వంపైనా రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనుంది. పోలింగ్ బూత్‌లతో సంబంధం లేకుండా వంద మందితో సాధారణ సభ్యత్వాలు చేపట్టిన వారికి క్రియాశీలక సభ్యత్వం అందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభ్యత్వ నమోదుకు మొత్తం 7 వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పార్టీ వెల్లడించింది.