Raghunandhan Rao On CM Revanth :సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ వెంట్రుకతో కూడా సమానం కాదని బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ వెన్నులో వణుకు వచ్చిందని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ, బోడీలు అని రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడటం తగ్గించుకోవాలని హెచ్చరించారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా గడిలో నుంచి దొర వచ్చి పోటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వగ్రామానికి ఆయన వస్తారా? లేక ఆయన తరఫున ఎవరినైనా పంపిస్తారో తెలియదు కానీ తాను ఏ గడిలో పుట్టానో రేవంత్ రెడ్డి చెబితే వారి పేరు మీద ఆ గడిని రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పారు.
Raghunandan Rao Fires on CM : 2014 నుంచి 2024 వరకు మోదీ మెదక్‌కు ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారని రఘనందన్ రావు అన్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి మోదీ ఇచ్చిన నిధులను పుస్తకం రూపంలో ఆయనకు కొరియర్ పంపిస్తున్నానని చెప్పారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామన్న హామీ నెరవేరదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై గతంలో హౌస్ కమిటీ వేశారని గుర్తు చేశారు. కమిటీ నివేదిక అమలు చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డురాదన్న రఘునందన్, సెప్టెంబర్ 17న నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామన్న హామీ నెరవేరదని జోస్యం చెప్పారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామన్న హామీ నెరవేరదన్నారు.
ఉత్తర ప్రగల్భాలు పలికారు :మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర ప్రగల్భాలు పలికారని రఘునందన్ రావు విమర్శించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం ఇచ్చిన నిధులపై ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్ర నిధులపై వివరాలను సీఎం, సీఎస్‌లకు పంపిస్తామని తెలిపారు. రెండు పడకల ఇళ్లు, రోడ్లు, ఉపాధి నిధులపై వివరాలు ఉన్నాయన్న రఘునందన్, పల్లె ప్రకృతి వనాలకు రూ.4.23 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు. రైతు వేదికలకు రూ.10 లక్షల చొప్పున నిధులు అందజేశామన్నారు. వైకుంఠదామాలకు రూ.11.13 లక్షల చొప్పున అందజేశామన్నారు.
"మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెట్లకు, స్వచ్ఛ భారత్‌కు, అమృత్ పథకాలకు ప్రధాని మోదీ ఇచ్చిన నిధులను ఒక పుస్తక రూపంలో తెచ్చాము. దీనిని సీఎంకు పంపిస్తాం. మీ కొడంగల్ అసెంబ్లీలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన నిధులు ఇందులో ఉన్నాయి. ఈ దేశం గత పదేళ్లుగా మోదీ పాలనలో ప్రశాంతంగా ఉంది. జీవన్ రెడ్డిని స్థానికులే వద్దనుకుంటున్నారు." - రఘునందన్ రావు, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి