Hyderabad Lok Sabha Election Results 2024 :రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల చూపు ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై పడింది. ఇందులో భాగంగా నేడు ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీకి గట్టి పోటీనిస్తున్నారు. మొదటి రౌండ్‌లో 4,903 ఓట్లతో మాధవీలత ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్‌లోనూ గట్టి పోటీని ఇచ్చారు. రెండో రౌండ్‌లో ఆమె 3,276 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Lok Sabha Election Results 2024 :కానీ మూడో రౌండ్‌కు వచ్చేసరికి మాధవీలతపై ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యం సాధించారు. 4,375 ఓట్ల ఆధిక్యంలో ఒవైసీ ముందంజలో ఉన్నారు. నాలుగు రౌండ్‌లోనూ ఒవైసీ 8910 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను బరిలో నిలిపినప్పటికీ పోటీని ఇవ్వలేదని తెలుస్తోంది. మజ్లిస్ కంచుకోటను మాధవీలత బద్ధలుకొట్టి, చరిత్ర తిరగరాస్తుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఏదీ ఏమైనా మరి కొద్ది గంటల్లో హైదరాబాద్ బాద్ షా ఎవరనేది తేలిపోనుంది.
హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నో ఏళ్లుగా ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ పాగా వేయాలని ఎప్పటినుంచో బీజేపీ ఊవిళ్లూరుతోంది. ఈ ఒక్క సీటులో కనుక బీజేపీ గెలిస్తే ఇక రాష్ట్రంలో ఆ పార్టీకి తిరుగే ఉండదనే అభిప్రాయం ఉంది. భారతీయ జనతా పార్టీకి తలనొప్పిగా మారిన ఆయన్ను కట్టడి చేయాలంటే ఎంపీగా ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఈసారి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే మాధవీలతను ఒవైసీపై బరిలోకి దింపింది.
కానీ ఇక్కడ ఒవైసీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రతిసారి తన పార్టీని విజయతీరాలకు చేరుస్తూనే ఉంటారు. ఈసారి మాత్రం బీజేపీ కాస్త గట్టి పోటీనిచ్చింది. ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థి మాధవీలత తన ప్రచారంతో పాతబస్తీలో కొత్త ప్రయత్నానికి తెరలేపారు. అసదుద్దీన్ వ్యూహాలకు పదునుపెట్టేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగారు.
అసదుద్దీన్ ఒవైసీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. సోషల్ మీడియాలోనూ క్రేజ్‌ను సైతం సొంతం చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే, ఆమె విజయం సాధించి మజ్లిస్ కోటను బద్దలు కొట్టబోతుందా అనే చర్చ నడుస్తోంది. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో కమలం పార్టీ ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఓటు బ్యాంకు సాధించుకుంది.