BJP Leaders Reactions on Telangana Budget 2024 :కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఏం చేస్తుంది, ఎన్ని నిధులు కేటాయించారో చెప్పకుండా తమ గొప్పలు చెప్పుకోవడమే లక్ష్యంగా బడ్జెట్ ప్రసంగం సాగిందని బీజేపీ నేతలు ఆరోపించారు. భట్టి విక్రమార్క బడ్జెట్ అంతా అభూత కల్పన, అంకెల గారడి, ఆర్భాటం తప్ప అందులో ఏమీ లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్లో ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే ఉందని విమర్శించారు. ప్రతి సంవత్సరం రైతులకు సీజన్ ముందు ఇవ్వాల్సిన పంటపెట్టుబడి సాయానికి బడ్జెట్లో ఎందుకు కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. బడ్జెట్ మొత్తంలో ఆసరా పెన్షన్‌ల ప్రస్తావనే లేదన్న ఆయన పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ నేతలు మోసం చేశారని ధ్వజమెత్తారు.
"మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసే ఎత్తలేదు. దళిత సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ.21,072 కోట్ల నుంచి రూ.7,638 కోట్లు తగ్గిపోయింది. గిరిజన సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ. 4,365 కోట్ల నుంచి రూ. 3,969 కోట్లకు తగ్గిపోయింది. మొత్తం ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, కానీ మైనారిటీల సంతుష్టీకరణ మాత్రమే మాకు కావాలనే కాంగ్రెస్ ఆలోచన మరోసారి ఈ బడ్జెట్లో మరోసారి బట్టబయలైంది." - కిషన్రెడ్డి, కేంద్రమంత్రి
Kishan Reddy Reaction on Telangana Budget 2024 : 2023-24లో రూ.2వేలుగా ఉన్న మైనార్టీ సంక్షేమ నిధులను ఈ బడ్జెట్లో ఏకంగా రూ.3,003 కోట్లకు పెంచారని విమర్శించారు. ఒక్క ఏడాదిలోనే 30శాతం కోటా పెంచేశారని ఆరోపించారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు అన్నారు దాని ఊసే లేదని, కేంద్రమంత్రి విద్యా నిధి పథకం కింద రూ.5 లక్షల సాయం అని దాని ప్రస్తావనే తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారని గుర్తుచేశారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ద్వారా రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని వ్యాఖ్యానించారు.
Bandi Sanjay In TG Budget 2024 : గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కూడా అంతేనని, దానికి రాష్ట్ర బడ్జెట్ నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. భట్టి విక్రమార్క చదివింది ఆర్థిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా అని ఎద్దేవా చేశారు. అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా ప్రశ్నించారు.
అప్పులున్న విషయం తెలిసి కూడా 6 గ్యారంటీలు ఇచ్చి వాటన్నింటికి బడ్జెట్లో నిధులెందుకు కేటాయించలేదన్నారు. 6 గ్యారంటీలు సహా హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులకు సరిపడా ఆదాయం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో బడ్జెట్లో లెక్కా పత్రం చూపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చి 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే అని ధ్వజమెత్తారు.