రైతులకు భయపడి సీఎం జగన్ పరదాల మాటున తిరుగుతున్నారు: బీజేపీ BJP Kisan Morcha Raithu Garjana in Vijayawada: విజయవాడలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు గర్జన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులకు కేంద్రం ఇస్తోన్న నిధులను కూడా సీఎం జగన్ లాగేసుకుంటున్నారని ఆరోపించారు. లక్ష 70 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రచారం చేసుకుంటుందని, కానీ ప్రతి ఒక్కరి నెత్తిన రెండు లక్షల రూపాయల అప్పు ఉంచారని ఆరోపించారు.
ప్రతి ఒక్కరి నెత్తిపై రెండు లక్షల అప్పు: ముఖ్యమంత్రి నిజంగా రైతుల పక్షపాతి అయితే వ్యవసాయదారులు ఎందుకింత తీవ్రమైన నైరాశ్యంలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. తమ ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా ప్రచారం చేసుకుంటోన్న సీఎం రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించి అవమానించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ప్రతి ఒక్కరి నెత్తిన రెండు లక్షల రూపాయల అప్పు ఉంచారని ఆరోపించారు. విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు రైతులను ముందుండి నడిపిస్తామని ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు చేసిన ప్రసంగాలకు వాస్తవాలకు మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉందని అన్నారు. ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలవడం అత్యంత ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన వ్యవసాయదారులను ఆదుకున్న పాపాన పోవడం లేదని, ధరల స్థిరీకరణ, విపత్తుల నిధులు ఏమయ్యాయని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద విడుదల చేస్తోన్న నిధులతో కనీసం సాగునీటి కాలువ మరమ్మతులు కూడా చేయించలేని దయనీయ పరిస్థితిలో పాలన సాగిస్తున్నారన్నారు.
బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళనలో తోపులాట - గుంటూరులో ఉద్రిక్తత
నేలిమాలిగల్లోకి పది వేల కోట్ల రూపాయలు: రాష్ట్రంలో సీఎం జగన్ రైతులను అరెస్టు చేస్తూ ప్రజాకంఠక పాలన సాగిస్తున్నారని, బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ మండిపడ్డారు. వ్యవసాయ రుణాలు సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. యాంత్రీకరణ అటకెక్కించారని ఎద్దేవా చేశారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తు జాగ్రత్తలను సూచించే వాతావరణం కూడా రాష్ట్రంలో లేకుండా పోయిందని ఆవేదన చెందారు. కేంద్ర ప్రభుత్వం ఏడు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో తీసుకుని వాటి పూర్తికి సహకరిస్తామని ముందుకొచ్చినా సమగ్ర ప్రాజెక్టు నివేదిక పంపించే తీరిక కూడా జగన్ సర్కార్‌కు లేదని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తున్నట్లు తన సొంత పత్రికల్లో ప్రకటనలు వేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కింద అంచనాలు పెంచి నిధుల కోసం కేంద్రానికి వినతులు ఇస్తున్నారని, కేంద్రం నుంచి 55 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరైతే అందులో ఓ పది వేల కోట్ల రూపాయలను తన నేలిమాలిగల్లోకి మళ్లించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ రైతులకు భయపడి పరదాల మాటున తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.
రైతుల సొమ్మును జగన్ బంధువులు కాజేయడానికే స్మార్ట్ మీటర్ల పథకం- అఖిలభారత కిసాన్ సభ
దళారుల భరోసా కేంద్రాలు: జే టాక్స్ పేరిట అందరిపై అదనపు భారం మోపుతున్నారని మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు విమర్శించారు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రరాష్ట్రంలో వ్యవసాయం గిట్టుబాటు కాకపోతున్నా ముఖ్యమంత్రి కరడుగట్టిన నియంతృత్వ పాలనతో రైతుల నడ్డి విరుస్తున్నారని కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సురేష్‌రెడ్డి ఆవేదన చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలి తుపాను పంటలు నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందించలేదని, తాము గత మూడు నెలల నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతోందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. రైతు భరోసా కేంద్రాలు దళారుల భరోసా కేంద్రాలుగా మారాయని ధ్వజమెత్తారు.
'పీఎం కిసాన్ నిధుల పెంపు'- పార్లమెంట్లో మోదీ సర్కార్ క్లారిటీ