BJP Candidates Won in Sitting MP Positions in Telangana : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. గతంలో సాధించిన సీట్ల సంఖ్యను ఈసారి రెట్టింపు చేసుకుంది. ముఖ్యంగా తమ కంచుకోటల్లో సిట్టింగ్ అభ్యర్థులు మరోసారి విజయదుందుభి మోగించారు. సికింద్రాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్ స్థానం నుంచి ధర్మపురి అర్వింద్ వరుసగా రెండోసారి గెలుపొందగా, ఆదిలాబాద్ స్థానం నుంచి తొలిసారి బరిలోకి దిగిన గోడం నగేశ్ 78 వేలకు పైగా మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు.
సికింద్రాబాద్ కా సికిందర్ కిషన్ రెడ్డి :సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ మరోసారి నిలబెట్టుకుంది. ఇక్కడి నుంచి పోటీ చేసిన కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై 52 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా బీఆర్ఎస్ స్థానం నుంచి పోటీ ఇచ్చిన పద్మారావు గౌడ్ మూడోస్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో కిషన్‌రెడ్డికి ఇది వరుసగా రెండో గెలుపు కావడంతో పార్టీ శ్రేణులు సంబురాలు జరిపారు.
కరీంనగర్లో రెండోసారి కమల వికాసం : రాష్ట్రంలో మరో కంచుకోట కరీంనగర్ నియోజకవర్గం. ఇది మళ్లీ బీజేపీ ఖాతాలోకే చేరింది. సిట్టింగ్ స్థానమైన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నారు. రెండో గెలుపుతో కమలం వికసించటమే కాకుండా, 2.12 లక్షల భారీ మెజారీటీని నమోదు చేశారు. కాగా ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున వెలిచాల రాజేందర్రావు, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్ పోటీలో నిలిచారు.