Bhatti Vikramarka Comments on KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాను కట్టిన ఇల్లును తానే తగలబెట్టి పోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులతో రాష్ట్రప్రజలపై రుణభారం మోపారని భట్టి ఆక్షేపించారు. సూర్యాపేటలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన భట్టి, బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) భారీగా కాంగ్రెస్‌లో చేరుతుంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నిన్న ఆయన మాటల్లో కొంచమైనా వాస్తవాలు లేవన్నారు.
పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారుతారా? అని ప్రశ్నించారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారని భట్టి మండిపడ్డారు. మైక్ సమస్య వస్తే, దానికి కూడా కరెంట్ కోతలు అంటూ అబద్ధం మాట్లాడారని ఆక్షేపించారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారన్న డిప్యూటీ సీఎం, పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ సరఫరా లేకుంటే వినియోగం ఎలా జరిగింది? :బొగ్గు లభించే ప్రాంతానికి 350 కి.మీ. దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించారని, అంత దూరంగా ఉండటం వల్ల థర్మల్ ప్లాంటుకు బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చువుతోందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. పర్యావరణ అనుమతులు పొందటంలో ఆలస్యం వల్లే, నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రానికి 4 వేల మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని విభజన చట్టంలోనే(Law of Partition) ఉందన్న భట్టి విక్రమార్క, విభజన చట్టం ప్రకారమే తెలంగాణకి ఎన్టీపీసీ మంజూరయ్యిందని వివరించారు.
సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ నిర్మించాల్సి ఉంది. కానీ, కమీషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవన్ ప్లాంట్ చేపట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతోందన్న డిప్యూటీ సీఎం, సరఫరా లేకుంటే ఇంత వినియోగం ఎలా జరిగిందని ప్రశ్నించారు. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో వినియోగం నమోదైనట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవన్న భట్టివిక్రమార్క, వినియోగదారులపై భారం మోపకుండా వ్యవస్థను గాడినపెట్టే చర్యలు చేపట్టామని వివరించారు.