Bandi Sanjay fires on Congress : రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఏ ప్రాతిపదికన ఇస్తారో ప్రజలకు చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) ప్రశ్నించారు. ఇవాళ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ప్రజాహిత యాత్ర నిర్వహించారు. యాత్రలో భాగంగా పట్టణంలోని పలు వీధుల గుండా తిరిగారు. పలు వార్డుల్లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
Prajahitha Yatra in Karimanagar : ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ పేద ప్రజలకు నియోజకవర్గానికి 3500 ఇండ్లు కట్టిస్తారా? లేదా గత ప్రభుత్వంలో సాదాసీదాగా కట్టిన రెండు పడకల గదులను కేటాయిస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎన్ని, ఈ ప్రభుత్వంలో ఎన్ని ఇళ్లను నిర్మించి ఇస్తారని అడిగారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు (Six Guarantees), హామీలను చూసి మోసపోయి ఓటేశామని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఒక్క మహాలక్ష్మి పథకం అమలుకే రూ.50,000 కోట్లు అవసరమని, మిగతా ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే రూ.5 లక్షల కోట్లు కావాలని బండి సంజయ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వమే రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళ తీయించిందని, మరి ఆరు గ్యారంటీల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డులకు లింక్ పెడుతున్నారని ధ్వజమెత్తారు. వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరించారు.