People Challenge For Vote Casting : ఓటింగ్ శాతం పెంచేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ఛాలెంజ్ విసురుతున్నాయి. ‘మీరు ఓటేయండి మీకు తెలిసిన పది మందికి ఓటేయాలని ఛాలెంజ్ విసరండి’ అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. కాలనీ సంక్షేమ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో ఈ నినాదాన్ని విస్తృతం చేయాలని కోరుతున్నారు.
హైదారబాద్ మహా నగరంలోని కొందరు సామాజిక కార్యకర్తలు ఈ నినాదాన్ని మరో కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ‘మీరు ఓటేయండి కొత్త ఓటర్లు ఓటేసేలా ఛాలెంజ్ ఇవ్వండి’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ఇంకు సిరాతో ఫొటోను పంచుకుంటూ మిగిలిన వారు ఓటేసి ఆ ఫొటోలను పంచుకోవాలనే నిబంధన పెడుతున్నారు.
Vote Casting Challenge in Telangana: రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ప్రకటించిన షరతులతో కూడిన సెలవును దుర్వినియోగం చేస్తే వేతనంలో కోత విధించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతిపాదించింది. వేలిపై సిరా గుర్తును చూపిన తర్వాతే సెలవుగా పరిగణించాలని ఐటీ, ఫార్మా తదితర రంగాల యాజమాన్యాలను కోరింది. ఇవే కాదు పోలింగ్ రోజున ఓటేసిన వాహనదారులకు లీటరు పెట్రోల్ ధరపై రూపాయి రాయితీ ఇచ్చేలా, షాపింగ్ మాల్స్‌లో రిబేటు ఇవ్వడంపై మార్గదర్శకాలు ఇవ్వాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది. గతంలో దిల్లీ వంటి నగరాల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో రూపాయి రాయితీకి ప్రాచుర్యం లభించిందని తెలిపింది. మహారాష్ట్రలోని మాల్స్ అసోసియేషన్లు రిబేటు ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి వివరించారు.