YS Sharmila Padayatra: రాష్ట్రంలో రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ గౌరవించడం లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. గెలిచిన శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్లాలనేది రాజ్యాంగం చెబుతోందని, కానీ వైఎస్సార్సీపీ శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్లలేదని, అలాంటి వారంతా రాజ్యాంగం ప్రకారం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేడ్కర్ స్మృతి వనం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి షర్మిల పాదయాత్ర నిర్వహించారు. భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలి: రాజ్యాంగాన్ని కాపాడాలని పాదయాత్ర చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎటువంటి దర్యాప్తు లేదని, అదానీని బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 1,750 కోట్ల రూపాయల లంచం తీసుకుంటే కనీసం విచారణ లేదని, అందరూ అదానీకి భయపడుతున్నారని ధ్వజమెత్తారు. వెంటనే విచారణ కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.