తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు - పవన్ కల్యాణ్​కు ఏ శాఖలంటే? - AP CABINET MINISTERS DEPARTMENTS - AP CABINET MINISTERS DEPARTMENTS

AP Cabinet Ministers Departments 2024 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్​లోని 24 మంత్రులకు శాఖలు కేటాయించారు. తన వద్ద సాధారణ పరిపాలన, శాంతిభద్రత శాఖలను ఉంచుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్​కు ఉప ముఖ్యమంత్రి సహా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరాతో పాటు మరో 3 శాఖలు కేటాయించారు. ఇంకా ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించారంటే?

AP Cabinet Ministers
AP Cabinet Ministers (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 2:22 PM IST

Updated : Jun 14, 2024, 3:56 PM IST

Departments of AP Cabinet Ministers 2024 :ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు తన సహచర మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగు నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. లోకేశ్​కు ఈసారి విద్యా శాఖతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖలు అప్పగించారు. ఉదయం నుంచి ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా తన నివాసంలో శాఖల కేటాయింపుపై సుదీర్ఘ కసరత్తు చేసిన చంద్రబాబు, శాఖల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన మహిళా నేత వంగలపూడి అనితకు కీలకమైన హోం శాఖ బాధ్యతలు అప్పగించడం విశేషం.

అమాత్యులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూర్పును పూర్తి చేశారు. సాధారణ పరిపాలనతో పాటు శాంతిభద్రతలు, ఇతర మంత్రులకు ఎవరికీ కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. ఊహించినట్లుగానే జన సేనాని పవన్‌కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లోకేశ్ నిర్వర్తించిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా వంటి కీలక శాఖల బాధ్యతలు ఈసారి పవన్‌ కల్యాణ్​కు కేటాయించడం విశేషం.

లోకేశ్ గతంలో తాను నిర్వర్తించిన ఐటీ శాఖతో పాటు విద్య, మానవ వనరులు, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్​లను ఉంచుకున్నారు. ఇక ఇతర మంత్రులకు కేటాయించిన శాఖలను పరిశీలిస్తే, గత ఐదేళ్లు ప్రతిపక్షంలో పోలీసుల నుంచి అనేక వేధింపులు, ఎస్సీ నేతైన తనపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎదుర్కొన్న వంగలపూడి అనితకు పోలీస్ సెల్యూట్‌ దక్కేలా శాఖ కేటాయింపు జరిగింది. హోంశాఖతో పాటు విపత్తు నిర్వహణ శాఖలను అనితకు అప్పగించారు.

సీనియర్‌ నేత అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌, పశు సంవర్ధక శాఖలను కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యనయల రామకృష్ణుడు నిర్వర్తించిన ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖలతో పాటు శాసనసభ వ్యవహారాల బాధ్యతలను పయ్యావుల కేశవ్‌కు అప్పగించారు. కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్‌ శాఖల బాధ్యతలు ఇచ్చారు.

నాదెండ్లకు పౌర సరఫరాలు : నాదెండ్ల మనోహర్​కు ఆహార, పౌర సరఫరాల శాఖను కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో తాను నిర్వర్తించిన మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖలను ఈసారి కూడా పొంగూరు నారాయణ కొనసాగించనున్నారు. అమరావతి నిర్మాణంతో పాటు రాజధాని వ్యవహారంపై నారాయణకు పూర్తి స్థాయి పట్టు ఉన్నందునే ఆయనకు అవే శాఖలను తిరిగి కట్టబెట్టారు. కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నిమ్మల రామానాయుడుకు జల వనరుల అభివృద్ధి శాఖను అప్పగించారు. పోలవరం పూర్తే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు సర్కారు, ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అదే ప్రాంతానికి చెందిన రామానాయుడుకు ఈ బాధ్యతలు అప్పగించారు.

బీజేపీ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సత్య కుమార్‌ యాదవ్‌కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖల బాధ్యతలు కేటాయించారు. ఎన్‌ఎండీ ఫరూక్‌కు న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖను అప్పగించారు. ఆనం రామనారాయణరెడ్డికి దేవదాయ శాఖను కేటాయించగా, అనగాని సత్యప్రసాద్‌కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలిచ్చారు. గృహ నిర్మాణం, సమాచార శాఖలను కొలుసు పార్థసారథికి కేటాయించగా, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను అప్పగించారు.

విద్యుత్ శాఖను గొట్టిపాటి రవికుమార్​కు ఇవ్వగా, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతను కందుల దుర్గేశ్​కు కేటాయించారు. గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం బాధ్యతలు అప్పగించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖలను కేటాయించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలను టీజీ భరత్​కు ఇవ్వగా, సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలను కేటాయించారు.

వాసంశెట్టి సుభాష్‌కు కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవల శాఖలను కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్‌కు ఎంఎస్‍ఎంఈ, సెర్ప్, ఎన్‍ఆర్‌ఐ వ్యవహారాలు అప్పగించారు. మండిపల్లి రామ్‍ప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడల శాఖల బాధ్యతలు ఇచ్చారు.

ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే

  1. చంద్రబాబు - సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు
  2. పవన్‌కల్యాణ్‌(ఉపముఖ్యమంత్రి) - పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  3. లోకేష్‌ - మానవ వనరులు, ఐటీ, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆర్టీజీ)
  4. వంగలపూడి అనిత – హోంశాఖ, విపత్తు నిర్వహణ
  5. అచ్చెన్నాయుడు - వ్యవసాయ, అనుబంధ శాఖలు
  6. కొల్లు రవీంద్ర – గనులు, జియాలజీ, ఎక్సైజ్‌
  7. నాదెండ్ల మనోహర్‌ - ఆహార, పౌరసరఫరాలు
  8. పొంగూరు నారాయణ – మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి
  9. సత్యకుమార్‌ యాదవ్‌- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
  10. నిమ్మల రామానాయుడు - జలవనరుల అభివృద్ధి
  11. ఎన్‌ఎండీ ఫరూక్‌ - న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం
  12. ఆనం రామనారాయణరెడ్డి - దేవదాయ
  13. పయ్యావుల కేశవ్‌ - ఆర్థికం, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు
  14. అనగాని సత్యప్రసాద్‌- రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
  15. కొలుసు పార్థసారధి - గృహనిర్మాణం, సమాచార శాఖ
  16. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి - సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు
  17. గొట్టిపాటి రవికుమార్‌ - విద్యుత్‌ శాఖ
  18. కందుల దుర్గేష్‌ - పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ
  19. గుమ్మడి సంధ్యారాణి - మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
  20. బీసీ జనార్దన్‌రెడ్డి - రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు
  21. టీజీ భరత్‌ - పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి
  22. ఎస్‌.సవిత – బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత
  23. వాసంశెట్టి సుభాష్‌ - కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా, వైద్య సేవలు
  24. కొండపల్లి శ్రీనివాస్‌ - ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు
  25. మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి - రవాణా, యువజన, క్రీడలు
Last Updated : Jun 14, 2024, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details