Nagababu gets Ministerial Post: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్‌లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. జనసేనలో చురుగ్గా పనిచేస్తోన్న నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా ఈ నిర్ణయంతో నాగబాబు త్వరలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పొత్తుల్లో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు: రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. కానీ, ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి మంత్రులుగా పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ మాత్రమే ఉన్నారు. కానీ, కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. భర్తీ కావాల్సిన ఆ ఒక్క స్థానం జనసేన నుంచి ఖరారు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.