Political Parties Focus On Malkajgiri MP Seat :గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంతర్భాగమైన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు లక్ష్యంగా మారింది. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఇక్కడ పోరు హోరాహోరీగా ఉండనుంది. రాష్ట్రంలో 'మినీ ఇండియాగా' భావించే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 38 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న ఈ పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎవరికి వారే గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు పెంచారు.
మూడు పార్టీల దృష్టీ ఆ స్థానం పైనే : కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో వచ్చిన ఫలితాలనే బీఆర్ఎస్ ఆశిస్తోంది. మోదీ చరిష్మాతో కాషాయ జెండా ఎగరేయాలని కమలదళం కూడా కృషి చేస్తోంది. మూడు ప్రధాన పార్టీలు మల్కాజిగిరిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఈసారి ఎన్నికలు ఎంతో రసవత్తరంగా మారాయి. కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.
గెలుపే దిశగా మూడు పార్టీల అడుగులు : 2019లో మల్కాజిగిరి స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. ఇప్పటి వరకు ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ ఖాతా తెరవలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందడంతో ఆ పార్టీ అదే ఊపుతో లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. మోదీ చరిష్మానే బీజేపీ నమ్ముకుంది. మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై దృష్టిపెట్టడంతో పోరు ఉత్కంఠంగా మారింది.
హస్తం పార్టీ హ్యాట్రిక్ సాధించేనా? :ఇప్పటికే ఈ స్థానంలో మూడుసార్లు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు గెలుపొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ తరఫున పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంత్‌రావుపై 8176 ఓట్లతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బరిలో నిలిచి గెలుపొందారు. రాజకీయంగా పడిపోయిన తనకు గెలుపునందించి నిలబెట్టి అప్పటి ప్రభుత్వంపై పోరాడే శక్తినిచ్చారని దీని ఫలితంగానే ఈ రోజు ముఖ్యమంత్రి నయ్యానంటూ సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తనలాగే కాంగ్రెస్ అభ్యర్థిని మరోసారి ఆదరిస్తే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి అభివృద్ధిపరుస్తానని హామీ ఇస్తున్నారు.
Congress Strategy To win Malkajgiri Seat : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా ఎంతో పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ మల్కాజిగిరి టికెట్ ఇచ్చింది. ఆమెను గెలిపించడానికి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి బాధ్యుడిగా నియమించి పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు మంతనాలు సాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి సైతం తనను ఎంపీగా గెలిపించడానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీల్లో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హావా కొనసాగినా ఇక్కడ మాత్రం కారు వేగాన్ని అడ్డుకోలేకపోయింది. ఇది ప్రతికూల అంశమే అయినా బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.