ACB Court Remanded Jogi Rajeev: అధికార అండతో గతంలో భారీగా అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ పాపాలు పండుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ మేరకు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అంబాపురం వద్ద భూములు కొనుగోలు చేసి సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్లలోకి మార్చి విక్రయాలు జరిపినట్లు గుర్తించామని ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. ఈ వ్యవహారంలో జోగి కుమారుడు రాజీవ్, సర్వేయర్ రమేశ్‌ను అరెస్టు చేశారు. వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించిన అధికారులు, విజయవాడ ఏసీబీ కోర్టులో వారిని హాజరుపరిచారు. జోగి రాజీవ్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సర్వే నెంబర్ మార్చేసి అక్రమాలకు పాల్పడ్డారు : జోగి రాజీవ్ అరెస్టుపై ఏసీబీ ఏఎస్పీ - ACB ASP on Jogi Rajeev Arrest
ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి:మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం పాపాలు ఏసీబీ విచారణలో ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూములు సీఐడీ అటాచ్ మెంట్‌లో ఉన్నాయి. దీనికి సంబంధించి 2018 ఆగస్టు 8న జీవో నెంబర్ 117, 2019 అక్టోబర్ 17న జీవో నెంబర్ 133తో స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. సర్వే నెంబర్ 88లో 2వేల 160 చదరపు గజాల భూమిని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేసి, భూమి రికార్డులు తారుమారు చేసి సర్వే నెంబరు కూడా మార్చేశారని ఏసీబీ తెలిపింది. సర్వే నెంబర్ 88లోని భూమిని కొని దానిని సర్వే నెంబర్ 87లోకి మార్పించి విక్రయించినట్లు ACB అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. దీనికి గ్రామ సర్వేయర్ సహకరించినట్లు వివరించారు.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమార్కులపై ACB కొరడా ఝళిపించింది. NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం 5 గంటలకే 15 మంది ACB అధికారులు, జోగి ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేశారు. రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలామంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కిందటి నెల రెండో వారం నుంచే ACB ఈ కేసుపై దృష్టి సారించింది. వచ్చిన ఫిర్యాదులు, ఆధారాలపై నిశిత పరిశీలన జరుపుతూ వచ్చిన ACB మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు జరిపింది.
జోగి రమేష్ కుమారుడిపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన ఏసీబీ - FIR on Jogi Rajeev
A1గా జోగి రాజీవ్ : జోగి రమేష్ ఇంట్లో తనిఖీలు చేసిన ACB అధికారులు అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో జోగి రాజీవ్ A1గా ఉన్నట్లు గుర్తించారు. జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావు A2గా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 2న మంగళగిరి CID పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఆరు సెక్షన్ల కింద జోగి రమేష్ తనయుడు, ఆయన కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. 420, 409, 467, 471, 120(B), 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో రాజీవ్‌తోపాటు మరో 7 మందిపై కేసులు నమోదు చేశారు. జోగి రాజీవ్‌ను అరెస్టు చేసి గొల్లపూడిలోని ACB కార్యాలయంలో విచారణ జరిపారు.
అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అక్రమంపై లోతైన విచారణకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ACBని ఆదేశించారు. విచారణలో తేలిన అంశాల ప్రకారం కేసు నమోదు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో జోగి రాజీవ్ రిమాండ్‌పై వాదనలు జరిగాయి. అనంతరం రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.
అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ కొరడా- మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్! - ACB Raids in Jogi Ramesh House