Divorce Rate Increase in India :సంసార నావను దరికి చేర్చాలన్నా కుటుంబమనే బండి సజావుగా ముందుకు నడవాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత ముఖ్యం. పిల్లల భవిష్యత్తుకు కూడా ఇది కీలకమే. అయితే ఇటీవల విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు ఈ విషయంలో కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, చిన్న కుటుంబాలు పెరిగిపోవటం, సామాజిక మాధ్యమాలు వీటిలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు. ప్రేమ పెళ్లిళ్లు కూడా పెటాకులు అవుతుండటం భార్యభర్తల సంబంధానికి తీవ్ర విఘాతంగా మారింది.
రోజురోజుకీ పెరుగుతున్న విడాకులు : భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. అలాంటి దేశంలోనే కొంతకాలంగా విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుతం విడాకుల ట్రెండ్ నడుస్తోంది. కొన్ని కారణాలు చాలా చిన్నగా, వింతగా అనిపించినా కోర్టు మెట్లు ఎక్కుతున్న వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. వీరిలో చదువుకున్న వారు కూడా ఎక్కువ ఉంటున్నారు.
ఆర్థిక స్వాతంత్య్రం, మారుతున్న సామాజిక పరిస్థితులు, తానే గొప్ప అనే ధోరణులు ఇలా విడిపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలకు కారణం అవుతున్నాయి. పెరిగి పెరిగి విభేదాలుగా మారి తర్వాతి కాలంలో గొడవలకు దారి తీస్తున్నాయి. సర్దుబాటు చేసుకోలేని క్రమంలో గొడవలు పెరిగి పోలీసు కేసులు, కోర్టులు చివరకు విడాకులతో పరిసమాప్తి అవుతోంది. భార్యభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తుంటే కుటుంబ బాధ్యతలు పంపకం, ఇంటి పనులు, పిల్లల పెంపకం వంటి విషయాల్లో గొడవలు వస్తున్నాయి.
బాధ్యతల పంపకాల విషయంలో తేడాలు :గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు జరిగేవి. కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు వచ్చాయి. అప్పట్లో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు వస్తే ఇంటిపెద్ద పరిష్కరించే వారు. ఇద్దరి తరపు పెద్దవారు కూర్చుని 4 గోడల మధ్యే వారి మధ్య అంతరాన్ని తొలగించేవారు. దంపతులు ఇద్దరూ ఉద్యోగస్థులైతే బాధ్యతల పంపకాల విషయంలో తేడాలు వస్తున్నాయి. మరికొందరు కంప్యూటర్లు, సెల్ఫోన్లతో పని చేస్తూ సంసార జీవితానికి దూరమవుతున్నారు.
భార్య, భర్తలకు కౌన్సిలింగ్ : వివాహ బంధంలో దంపతుల మధ్య పరస్పరం ప్రేమానురాగాలు ఉంటేనే ఆ కాపురం సజావుగా సాగుతుంది. అనుమానాలు, ఘర్షణలు, వాదులాటలు, కట్నం వేధింపుల వల్ల బంధం బీటలు వారుతుంది. ఈ క్రమంలోనే కొందరు మహిళలు గృహ హింస బారిన పడుతున్నారు. వేధింపులు తాళలేక బాధితులు పోలీసులకు లేదా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన సఖి-వన్‌స్టాఫ్ సెంటర్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ కేసుల్లో గృహ హింస నిరోధక చట్టం కింద ఫిర్యాదులు స్వీకరించి భర్త, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు.
గృహ హింస నిరోధక చట్టం కింద ఫిర్యాదు అందిన తర్వాత భార్య, భర్త ఇద్దరికి కౌన్సెలింగ్ నిర్వహిస్తుంటారు. రెండు సార్లు కౌన్సెలింగ్ చేసిన తర్వాత కొందరు రాజీ చేసుకుని కలిసి మెలిసి ఉంటారు. రాజీకి అంగీకరించకుంటే పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయించి న్యాయ స్థానంలో ప్రవేశపెడుతున్నారు. తమ వద్దకు వచ్చిన కేసుల్లో భార్యాభర్తలు ఇద్దరితో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి రాజీ కుదర్చడానికే ప్రయత్నిస్తారు. కొందరు అంగీకరిస్తున్నారు. అంగీకరించని వారిపై కేసులు నమోదు చేసి కోర్టులకు పంపిస్తున్నారు. అయితే రాజీతోనే కుటుంబాలు నిలబడి పిల్లలను చూసుకునే అవకాశం ఉంటుందని సఖి నిర్వాహకులు చెబుతున్నారు.
బంధానికి బీటలు :గణాంకాలు, కేసుల బట్టి చూస్తే నేటి సమాజంలో పెళ్లి ఎంత సహజమో, విడాకులు కూడా అంతే అనే పరిస్థితి కనిపిస్తోంది. విడాకులకు దారి తీసే పరిస్థితులు, కారణాలపై జరిపిన సర్వేలో చాలారకాల కారణాలు వెల్లడయ్యాయి. వాటిలో 7రకాల కారణాలు అందరిలో కామన్‌గా కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలతో మోసం, ప్రేమ లేకపోవడం, అత్యాశ, ఇష్టం లేని పెళ్లి, శారీరక సాన్నిహిత్యం లేకపోవడం, సాన్నిహిత్య లోపం. మానసికంగా ఒంటరిగా ఉన్నప్పుడు జంటగా ఒకే ఇంట్లో నివసించినా అందులో జీవం ఉండదు. ఫలితంగా కాలం గడిచే కొద్దీ ఆ బంధం బీటలు వారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.