Virudhnagar LS Elections 2024 Tamil Nadu :తమిళనాడులోని విరుధ్‌నగర్ లోక్‌సభ స్థానంలో ఎన్నికలు ఆసక్తి రేతెత్తిస్తున్నాయి. దేశంలో టపాసుల తయారీకి కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం రాజకీయంగానూ మోత మోగించేందుకు వేదికైంది. ప్రముఖ సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ఈ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా, ఏఐఏడీఎంకే, డీఎండీకే ఉమ్మడి అభ్యర్థిగా సీనియర్ నటుడు, డీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ రంగంలోకి దిగారు. అధికార డీఎంకే-కాంగ్రెస్ కూటమి తరఫున సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మరోసారి పోటీ పడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు ఈ నియోజకవర్గంపై గట్టి పట్టుంది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఠాగూర్ 2014లో ఓడినప్పటికీ, 2019లో తిరిగి గెలుపొందారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా చూసినా మొత్తం ఆరు స్థానాలకు నాలుగుచోట్ల డీఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు.
రాధిక ప్రస్థానం
చాలాకాలంగా రాజకీయ పోరాటానికి మాత్రమే వేదికగా నిలుస్తున్న విరుధ్‌నగర్ రాధిక రాకతో సినీ గ్లామర్ అద్దుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించిన రాధిక దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ను వివాహం చేసుకున్న ఆమె రడాన్ మిడియా వర్క్స్ ను ప్రారంభించి నిర్మాత అవతారం ఎత్తారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతోపాటు బుల్లితెరపై పలు సిరియళ్లు కూడా నిర్మించారు.
రాజకీయంగానూ తమిళనాట డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల్లో పనిచేశారు. ఆమె భర్త శరత్‌కుమార్ కూడా దక్షిణాదిలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో రాజకీయ రంగప్రవేశం చేసి ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చి పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవల ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. తాజాగా తన భార్య రాధికను విరుధ్‌నగర్ బరిలో బీజేపీ తరఫున పోటీకి నిలిపారు. ఇరువురూ కలిసి నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
'ఆయన నాకు కొడుకుతో సమానం'
విరుధ్‌నగర్‌లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండడం వల్ల రాధిక ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. విరుధ్‌నగర్ నుంచి తన భార్యను ఎంపీని చేయడమే తన లక్ష్యమని చెప్పిన శరత్‌కుమార్ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని ప్రచారంలో చెబుతున్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా తన భర్త శరత్‌కుమార్ సాయంతో పరిష్కరిస్తానని రాధిక ఓటర్లకు హామీ ఇస్తున్నారు.
గతంలో విజయకాంత్ సరసన అనేక సినిమాల్లో నటించిన రాధిక తాజాగా ఆయన కుమారుడు ప్రభాకరన్ తనపై పోటీ చేస్తుండడంపై స్పందించారు. ప్రభాకరన్ తనకు కుమారుడితో సమానమని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ విజన్, గత పదేళ్లుగా దేశంలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని రాధిక జాతీయ మీడియా ముఖాముఖీలో చెప్పారు. 'గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్కసారి గమనిస్తే ఎన్నో మంచి పనులు చేశారు. ఉత్తమ పాలనను అందించారు. ప్రజలకు ఎంతో సేవ చేశారు. వరుసగా మూడోసారి విజయం అనేది దేశానికి ఎంతో మంచిది. ప్రజల విషయానికి వస్తే అంతిమంగా వారి తీర్పు కోసం ఎదురుచూడాలి' అని రాధిక అన్నారు.