US Presidential Election 2024 Biden VS Trump :అధ్యక్ష ఎన్నికల ముంగిట అగ్రరాజ్య రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రపంచగతిని ప్రభావితం చేయగల నాయకుడిని ఎన్నుకునేందుకు ఉద్దేశించిన మహాసంగ్రామం ఇద్దరు వ్యక్తుల తడబాటు, దూకుడుకు మధ్య పోటీగా మారింది. రెండోసారి అగ్రరాజ్యాధినేత కావాలని అభిలషిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(81) వృద్ధాప్య సమస్యలు అధికార డెమొక్రటిక్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ప్రత్యర్థిని ఎదుర్కోవడం కన్నా, డెమొక్రాట్ల చర్చలు, వ్యూహరచనలన్నీ అధ్యక్ష అభ్యర్థిని మార్చాలా, లేదా అనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఇందుకు పూర్తి భిన్నంగా విపక్ష రిపబ్లికన్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్(78) అధ్యక్ష అభ్యర్థిత్వం, విజయావకాశాలపై కొంతకాలం క్రితం వరకు క్రిమినల్ కేసుల రూపంలో ఉన్న నీలిమేఘాలన్నీ ఒక్కసారిగా తొలగిపోవడం ఆ పార్టీలో కొండంత ఉత్సాహం నింపింది. అయితే, ఇలాంటి రసవత్తర మలుపులతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అమెరికా రాజకీయం, ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్యానికి పరీక్షగా నిలిచింది. సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసే ఆర్థిక రంగం, వలసలు, పన్నులు, వైద్య బీమా, గర్భవిచ్ఛిత్తి చట్టాలు, తుపాకుల చట్టాలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇజ్రాయెల్-గాజా యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ సంగ్రామం, వాతావరణ మార్పులు వంటి కీలకాంశాలను విస్మరిస్తూ ఇద్దరు నేతల వ్యక్తిగత వ్యవహారాల చుట్టూ సాగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రజానీకం ఏమాత్రం పరిణతి కనబరుస్తుంది, తీర్పు ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకమైంది.
రాజకీయాన్ని మార్చేసిన 'రాత్రి'
2024 నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రైమరీలుగా పిలిచే రాష్ట్రాలవారీ ఎన్నికలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెలలోనే రిపబ్లికన్ పార్టీ, ఆగస్టులో డెమొక్రటిక్ పార్టీ జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించి అధ్యక్ష అభ్యర్థులు ఎవరో అధికారికంగా ప్రకటించనున్నాయి. డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీల్లో జో బైడెన్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. అధికార పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందన్న సంకేతాలిస్తూ నిరుద్యోగం రేటు భారీగా తగ్గడం, అబార్షన్లు వంటి వివాదాస్పద వ్యవహారాల్లో మెజారిటీ ప్రజల అనుకూల వైఖరి, ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను కేసులు చుట్టుముట్టడం వంటి సానుకూలతల మధ్య డెమొక్రాట్లు విజయం తథ్యమని విశ్వసించారు. కానీ, ఒకేఒక్క 'గురువారం' ఈ నమ్మకాల కోటను కూల్చేసింది. అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేసింది.
2024 జూన్ 27, గురువారం, అట్లాంటా వేదికగా ముఖాముఖి తలపడ్డారు ఇరు పార్టీ అధ్యక్ష అభ్యర్థులు. ఆ రాత్రి జరిగిన చారిత్రక చర్చ, విజయతీరాలవైపు సాగాలని ఆశించిన డెమొక్రాట్లను కష్టాల సుడిలోకి నెట్టేసింది. అందుకు కారణం బైడెన్ తడబాటు. ట్రంప్‌తో వాగ్యుద్ధంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు ప్రస్తుత అధ్యక్షుడు. సూటిగా మాట్లాడుతూ, గణాంకాలు ఉదహరిస్తూ ట్రంప్ పూర్తి విశ్వాసాన్ని కనబరిస్తే బైడెన్ తీరు అందుకు భిన్నం. తడబాటుకు గురవడం, అసంబద్ధంగా ఆగిపోవడం అనేక విమర్శలకు తావిచ్చింది. బైడెన్ కొంతకాలంగా మతిమరుపుతో బాధపడుతున్నారని, 81ఏళ్ల వయసులో మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం కష్టమని ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదనలకు ఒక్కసారిగా కొండంత బలం చేకూరింది. అదే సమయంలో, బైడెన్ మానసిక స్థితికి సంబంధించి అనేక వార్తలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన పనితీరు బాగానే ఉన్నా, మిగిలిన సమయాల్లో ఇలానే కాస్త ఇబ్బందికర రీతిలో పనిచేసేవారని శ్వేతసౌధం అంతరంగికులు కొందరు ఉప్పందించారంటూ అమెరికాలోని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.
పోలింగ్‌కు 4 నెలల ముందు జరిగిన బైడెన్-ట్రంప్ ముఖాముఖి, డెమొక్రాట్లలో తీవ్ర గందరగోళానికి కారణమైంది. అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ తప్పుకుని మరొకరి అవకాశమిస్తే తప్ప పార్టీ గట్టెక్కడం కష్టమనే వాదనలు ఊపందుకున్నాయి. కీలక నేతల్లో అతికొద్ది మంది మాత్రమే ఈ విషయాన్ని బాహాటంగా చెబుతుండగా మిగిలిన వారంతా నష్టనివారణకు అష్టకష్టాలు పడుతున్నారు. రేసు నుంచి బైడెన్‌ను తప్పించలేని పరిస్థితుల మధ్య కింకర్తవ్యం అంటూ తలలు పట్టుకుంటున్నారు. బయటకు మాత్రం అంతా బాగుందనే సంకేతాలిచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఒక్కరాత్రి అధ్యక్షుడు తడబడినంత మాత్రాన ఏమీ కాదని, గత నాలుగేళ్లలో ఆయన పనితీరును చూడాలంటూ బైడెన్‌కు అండగా నిలిచేందుకు యత్నిస్తున్నారు.
ఈ పరిణామంతో బైడెన్ వ్యక్తిగతంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌తో ముఖాముఖికి ముందు విదేశీ పర్యటనలకు వెళ్లి, అలసిపోవడమే ఇందుకు కారణమంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. శ్వేతసౌధం ప్రతినిధులూ ఇదే పాట పాడారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయినందున కాస్త వైఖరి మార్చారు. 'అధ్యక్ష అభ్యర్థిని నేనే, యుద్ధం చేసేది నేనే, పార్టీని విజయతీరాలకు చేర్చేది నేనే' అంటూ దూకుడు వ్యాఖ్యలతో డెమొక్రాట్లలో భరోసా నింపేందుకు బైడెన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.