Underground Mines Gradually Decreasing In Singareni :సింగరేణిలో ఉపరితల గనులకు ప్రాధాన్యత పెరిగింది. కానీ, అది కార్మికుల్లో ఆందోళనకు కారణమైంది. కారణం భూగర్భ బొగ్గుగనుల స్థానంలో ఉపరితల గనులకు ప్రాధాన్యం ఇవ్వడం, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండడమే. ఓపెన్ కాస్ట్ గనుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో లక్షలాది మంది కార్మికులతో కళకళలాడిన సింగరేణి ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు భూగర్భజల వనరులు అడుగంటడంతో పాటు వ్యవసాయం కూడా గణనీయంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు సింగరేణి గనులు ఉపాధి కల్పించే కేంద్రాలు ఉండగా ఇప్పుడు కేవలం ఉత్పత్తి కేంద్రాలుగానే మిగిలిపోతున్నాయనేది కార్మికుల వాదన. మరి ఎందుకీ పరిస్థితి? కార్మికులకు కావాల్సిందేంటి?
తగ్గుతున్న కార్మికుల సంఖ్య :సింగరేణిలో భూగర్భ బొగ్గుగనుల స్థానంలో ఉపరితల గనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు. దీంతో అత్యధిక మానవశక్తిని వినియోగించి బొగ్గు ఉత్పత్తి చేసిన భూగర్భ గనులు కనుమరుగు అవుతున్నాయి. వాటి స్థానంలో ఉపరితల గనులు ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తి చేపడుతున్నారు. గతంలో 56 భూగర్భ గనులుండగా వాటి సంఖ్య ఇప్పుడు 21కి పడిపోయింది. రానున్న కాలంలో మరింత తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ఆ మేరకు కార్మికుల సంఖ్య కూడా తగ్గుతోంది.
భూగర్భ గనుల కంటే ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా చేపట్టే అవకాశం ఉండటంతో యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకుంది. దీంతో పాటు కొత్త గనుల ఏర్పాటుకు కేంద్రం నూతన చట్టం తీసుకురావడంతో ఉన్న వాటినే సర్దుకుంటూ బొగ్గు ఉత్పత్తి దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కొత్త గనులు ఏర్పాటు చేయాలంటే వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. కాగా ఇటీవలే సింగరేణి ప్రాంతాల్లోని 4 గనులకు కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహించింది. అందులో 2 గనులను ప్రైవేటు సంస్థలు దక్కించుకున్నాయి. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకపోవడం వల్ల అవి బయటి వారి చేతుల్లోకి వెళ్లాయి. ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించాలని కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
గనుల స్థానంలో ఉపరితల గనులు ఏర్పాటు :సింగరేణి వ్యాప్తంగా 35 భూగర్భ గనులు కనిపించకుండా పోయాయి. తాజాగా బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖని గనిని కూడా ఉపరితలగనిగా మార్చేందుకు యాజమాన్యం ప్రణాళికలు చేసింది. రామగుండం రీజియన్‌లో జీడీకే-5, 5-ఎ, 6, 6-ఎ, 6-బి, 7, 7-ఎ, 8, 8-ఎ, 9, 10, 10-ఎ ఇలా మొత్తం 12 భూగర్భ గనులు లేకుండా పోయాయి. వాటి స్థానంలో ఓసీపీ-1, 2, 3, 5లుగా విస్తరించారు. భూగర్భ బొగ్గు గనుల్లో మిగిలిపోయిన నిక్షేపాలను పూర్తి స్థాయిలో వెలికి తీసేందుకు ఉపరితల గనులతోనే సాధ్యం అవుతుందని భావిస్తున్న సింగరేణి ఆదిశగా చర్యలు తీసుకుంది. బెల్లంపల్లి రీజియన్‌లోని గోలేటి, మాదారం, కేకే-1, ఆర్‌కే-1-ఎ, ఆర్‌కే-8, ఎస్‌ఆర్‌పీ-2, ఆర్‌కే-5 బి, ఆర్‌కే-5, 6, 7, న్యూటెక్ గనులు భవిష్యత్తు లో ఉపరితల గనిగా మారే అవకాశం ఉంది. కొత్తగూడెంలో వీకే-7, ఇల్లెందులో 21 ఇంక్లైన్‌లను మూసివేసి దాని స్థానంలో ఉపరితల గనిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కొత్తగా మరికొన్ని గనుల స్థానంలో ఉపరితల గనులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశారు.
అపారమైన బొగ్గు నిక్షేపాలున్నప్పటికీ కొత్త గనులు ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో యాజమాన్యం విస్తరణ ప్రాజెక్టుల కింద ఉపరితల గనులను ఏర్పాటు చేస్తోంది. దీని వల్ల కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత గని కింద మాత్రమే దీనిని గుర్తిస్తారు. పర్యావరణ, ప్రాజెక్టు అనుమతులకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. అందుకే యాజమాన్యం భూగర్భ గనుల ఏర్పాటు చర్యలు తీసుకుంటోంది. ఇక సింగరేణి సంస్థ కొత్త గనుల కోసం ప్రాజెక్టు నివేదికలు తయారు చేసుకుంది. వాటిని ఏర్పాటు చేసుకోవాలంటే కేంద్రం తీసుకువచ్చిన చట్టం మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ రెగ్యులేషన్-MMDR చట్టం ప్రకారం తప్పనిసరిగా వేలంలో పాల్గొంటేనే కొత్త గనులు దక్కించుకోవచ్చు.
సింగరేణి విస్తరించిన పూర్వ 4 జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. రాంపూర్, పునుకుడుచిలక, తాడిచెర్ల-2, చండ్రుపల్లి, ములుగులోని బొగ్గు నిక్షేపాల వెలికితీతకు సింగరేణి సంస్థ ప్రణాళికలు రచించింది. దీంతో అనేక రకాలుగా అన్యాయం జరుగుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యంపై కార్మిక సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టన్ను బొగ్గు ధర చాలా తక్కువ :బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే ఎంతో అనుభవం ఉన్న కంపెనీ సింగరేణి. స్థానికంగా, సహజ సిద్ధంగా ఉన్న పరిస్థితులు బొగ్గు ధరపై ప్రభావం చూపుతాయి. ఇక్కడి భూగర్భ స్థితిగతులు బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతున్నాయి. దానిని అధిగమించాలని భావిస్తున్న సంస్థ ఉపరితల గనుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సింగరేణి కంటే ఇతర బొగ్గు పరిశ్రమల్లో టన్ను బొగ్గు ధర చాలా తక్కువగా ఉంది. సింగరేణితో పోల్చితే వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్, మహానది కోల్‌ఫిల్డ్స్‌లో బొగ్గు ధర తక్కువగా ఉంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అయ్యే ఖర్చుతో చూసుకుంటే మార్కెట్‌లో విక్రయిస్తున్న ధర తక్కువే. కానీ అంతకంటే తక్కువకు విక్రయించాలంటే సంస్థకు నష్టాలు తప్పవు. దీనిని ఏ విధంగా అధిగమించాలన్న విషయమై యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది.