- డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే
- రెండు పార్టీల మధ్యే సీఎం కుర్చీ
- తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయం ఇదే
- కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది!
- డ్యుయల్ హెడర్ కాస్తా మల్టీస్టారర్ బొమ్మగా మారుతోంది!
- సంప్రదాయ ద్రవిడ పార్టీలకు తోడు బీజేపీ దూసుకొస్తోంది.
- మరోవైపు, కొత్త పార్టీలూ సై అంటున్నాయి.
Tamil Nadu Politics 2024 :లోక్‌సభ ఎన్నికలకు గట్టిగా మూడు నెలలు కూడా లేదు. అప్పుడే తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఓ వైపు కొత్త పార్టీల సందడి నెలకొంటే మరోవైపు, రాష్ట్రంలో నిలదొక్కుకోవాలని మరికొన్ని పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అధికార డీఎంకేను ఢీకొట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల కంటే 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపైనే ఈ పార్టీలు దృష్టిసారిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే అధికారంలో ఉంది. 234 స్థానాలు ఉన్న అసెంబ్లీలో సొంతంగా 132 మంది సభ్యులతో బలంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు డీఎంకేకు మద్దతిస్తున్నాయి. విపక్ష అన్నాడీఎంకేకు 62 మంది సభ్యులు ఉన్నారు. అయితే, అన్నాడీఎంకే వర్గపోరుతో సతమతమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. డీఎంకేను ధిక్కరించే బలమైన శక్తి అవసరం ఏర్పడుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పలు పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
మూడో కూటమికి బీజేపీ ఏర్పాట్లు?
ఎన్నికల్లో పెద్దగా రాణించకపోయినప్పటికీ తమిళనాడులో తన సత్తా చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అన్నాడీఎంకేతో స్నేహం చెడినప్పటికీ కొత్తగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దివంగత విజయకాంత్ స్థాపించిన దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగం(డీఎండీకే), టీటీవీ దినకరణ్‌కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) వంటి పార్టీలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. జీకే వాసన్‌కు చెందిన తమిళ మానిలా కాంగ్రెస్, బహిష్కృత అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం వర్గం సహా ఇంకొన్ని చిన్న పార్టీలను సైతం కలుపుకునేందుకు యత్నిస్తోంది. పొత్తు విషయాలపై దృష్టిసారించేందుకు బీజేపీ జాతీయ నేతలు త్వరలోనే తమిళనాడులో పర్యటించనున్నట్లు సమాచారం.
అయితే, చిన్న పార్టీలన్నింటితో మూడో కూటమి ఏర్పాటు చేయడం వల్ల వచ్చే లాభం తక్కువే. బదులుగా అన్నా డీఎంకేతో కలిస్తేనే 2026 ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్న మాట. బీజేపీ కూడా అన్నా డీఎంకేతో కలిసే అవకాశాన్ని పూర్తిగా పక్కనబెట్టినట్లు లేదు. కూటమిలో ఉన్నప్పుడు అన్నాడీఎంకే నేతలపై తరచూ విమర్శలు గుప్పించిన అన్నామలై- వారు దూరమైన తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అన్నాడీఎంకేతో కలవాలని కొందరు బీజేపీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.
బీజేపీకి 15 శాతం ఓట్లు!
అయితే, బీజేపీని బలోపేతం చేయడమే తమ ప్రస్తుత లక్ష్యమని, కూటములు కాదని అన్నామలై చెబుతున్నారు. రాష్ట్రంలో తాను చేపట్టిన 'ఎన్ మన్ ఎన్ మక్కల్ యాత్ర'కు మంచి స్పందన వస్తుండటాన్ని చూసి అన్నామలై కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నాడీఎంకే విడిపోయిన తర్వాత కూడా తమిళనాడులో బీజేపీకి ఏ మాత్రం మద్దతు తగ్గలేదని అంటున్నాయి. దక్షిణ తమిళనాడు, కొంగు నాడు ప్రాంతాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందని బీజేపీ చెబుతోంది. మోదీ జనాకర్షణతో 3 నుంచి 4 శాతం ఓట్లు పెరుగుతాయని, బీజేపీ 15 శాతం ఓట్లు దక్కించుకుంటుందని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, తన బలమైన అస్త్రాలను కూడా తమిళనాడులో ప్రయోగిస్తోంది బీజేపీ. రామ మందిరం అంశంతో ప్రజల్లోకి వెళ్తోంది. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయాల్లో లైవ్ టెలికాస్ట్‌ను డీఎంకే అడ్డుకోవడానికి ప్రయత్నించడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. అయితే, ద్రవిడ పార్టీలను తట్టుకొని ముందుకెళ్లాలంటే స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారం, కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలకు చెందిన దాదాపు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. రాష్ట్రంలో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొని నిరంతరం శ్రమిస్తున్న బీజేపీకి ఇది బలం చేకూర్చేదే.
"పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలంతా రాష్ట్ర బీజేపీకి తమ అనుభవాన్ని తీసుకొస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నారు. కాబట్టి వీరంతా ఆయనకు మరింత బలం చేకూరుస్తారు. తమిళనాడు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో వారు (డీఎంకే పార్టీని ఉద్దేశించి) గమనిస్తూనే ఉంటున్నారని అనుకుంటున్నా."
-అన్నామలై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
అన్నాడీఎంకే పరిస్థితి ఏంటి?
జయలలిత మరణం, రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, పార్టీలో వర్గపోరు వంటి సమస్యలతో సతమతమైన అన్నాడీఎంకే ఇప్పుడిప్పుడు పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది. అన్నాడీఎంకే అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్రంలో వీలైనన్ని చిన్న పార్టీలతో జట్టుకట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో పోటీ పడుతూ వివిధ పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే), సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ)లతో చర్చలు జరుపుతున్నారు. డీఎండీకేతోనూ చర్చలు జరుపుతున్నప్పటికీ ఆ పార్టీ ఎన్డీఏలో చేరేందుకే మొగ్గుచూపుతోందని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
టీటీవీ దినకరణ్ ఏఎంఎంకే, టీఆర్ పారివేందర్కు చెందిన ఇందియ జననాయగ కట్చి (ఐజేకే), కే కృష్ణస్వామి నేతృత్వంలోని పుతియా తమిళగమ్ సైతం ఎన్డీఏ వైపే చూస్తున్నట్లు సమాచారం.