Prathidhwani on Schools Reopens in Telangana 2024 :వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులంతా బడి బాటపట్టారు. తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచడం కోసం రాష్ట్ర సర్కార్ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. పాఠశాలల భవనాల మరమ్మతులు, వసతుల కోసం రూ.2,000ల కోట్లతో పనులు చేపట్టింది. మరి నిధుల వినియోగంలో ఏయే అంశాలకు ప్రాధాన్యమిస్తోంది?
Telangana Schools Reopens Today 2024 : తండాలు, గూడెల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల బలోపేతం దిశగా తెలంగాణ సర్కార్ అడుగులేస్తోంది. మరోవైపు 10జీపీఏ వచ్చిన పిల్లల ఫీజుల చెల్లింపునకు సిద్ధమవుతున్న సర్కార్. ఈ నేపథ్యంలో బడిబాట లక్ష్యాలేంటి? ఏకోపాధ్యాయ పాఠశాలలపై ప్రభుత్వానికి ఎలాంటి విధానం ఉండాలి? విద్యాకమిషన్ ఏర్పాటైతే జరిగే మార్పులేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులను అలంకరించి, ప్రవేశ ద్వారాలకు మామిడి తోరణాలు కట్టి పండగ వాతావరణంలో విద్యార్థులకు స్వాగతం పలికారు. తొలిరోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్ని విద్యార్థులకు అందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తారని తొలుత సమాచారం అందినప్పటికీ, అనివార్య కారణాల వల్ల వాయిదాపడిందని విద్యాశాఖ వర్గాల సమాచారం.
స్వచ్ఛ కార్మికులను నియమిస్తేనే : పాఠశాల విద్యాశాఖ పరిధిలోని బడుల్లో శౌచాలయాలను శుభ్రం చేయడానికి, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ కార్మికుల(శానిటరీ వర్కర్లు)ను నియమిస్తామని కొద్ది నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటివరకు అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. మరోవైపు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తామని హస్తం పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. దానిపై కసరత్తు చేసిన అధికారులు కొత్తగా 203 చోట్ల బడులు అవసరమని విద్యాశాఖకు ప్రతిపాదించారు. వాటిని ప్రారంభించేందుకు ఇప్పటివరకు ఆదేశాలు రాలేదు. అయితే త్వరలోనే సీఎం హామీ అమలవుతుందని, సంబంధిత ఉత్తర్వులు వెలువడుతాయని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.