Prathidwani Debate on Election Campaign in Telangana : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ప్రచార పోరు పదునెక్కింది. 17 ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగిన మూడు పార్టీలు గెలుపుపై ధీమాతో ప్రజలకు హామీలిస్తున్నాయి. సాధ్యమైనంత ఎక్కువ స్ధానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఎన్నికల ఎజెండాలు ప్రకటించిన పార్టీలు ప్రత్యర్థుల వైఫల్యాలను అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి. ఈ మేరకు సంప్రదాయ పద్ధతుల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలతో పాటు సోషల్ మీడియా ప్రచారానికి నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ వేదికల నుంచి ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచార వ్యూహాలు, ఎన్నికల ఎత్తుగడలపై నేటి ప్రతిధ్వని.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పరిమితులులేని ఈ ఆన్‌లైన్ ప్రచారం చేసుకున్నోళ్లకు చేసుకున్నంతగా మారిపోయింది. కొత్త ఉపాధి మార్గాలను చూపుతోంది. ఓటర్లలో పట్టు పెంచుకునేందుకు పార్టీ స్థాయిలోనే కాకుండా అభ్యర్థులు కూడా వార్ రూంలను తెరుస్తున్నారు. మరోవైపు పలుకుబడి ఉన్న అడ్మిన్లు, యూట్యూబర్ల కోసం గాలిస్తున్నారు. కొన్ని స్థానాల్లో మినహా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారం రోజులుగా ప్రచారం దుమ్మురేగుతోంది.
సంప్రదాయ మీడియాలో ప్రసారానికి వీలులేని బూతులు, వివాదాస్పద వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో యథేచ్ఛగా పోస్టు చేస్తూ పలువురు నేతలు రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడిన క్షామ పరిస్థితులపై రచ్చ జరుగుతోంది. ఈ పరిస్థితికి మీరంటే మీరే కారణమని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ప్రచారానికి స్పందన ఉండటంతో పార్టీలు, నేతలు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న గ్రూపుల అడ్మిన్లపై ఫోకస్ పెట్టారు. దీంతో ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్లు, యూట్యూబ్ వార్తా ఛానళ్లకు గిరాకీ పెరిగింది.
ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి : దేశంలో 50 కోట్ల మంది వాట్సప్ యూజర్లు, 36.6 కోట్ల మంది ఫేస్‌బుక్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీటిలో ఎన్నికల సందర్భంగా ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. బయట రోడ్ల మీద పార్టీల సభలు, సమావేశాలు, సామాజిక మాధ్యమాల ప్రచారాలతో అంతటా సందడిగా మారుతోంది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా నకిలీ సమాచార వ్యాప్తి సహా, వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగే ప్రమాదం కూడా ఉంది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాలను వినియోగించే వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా, జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి అలాంటి వాటిపై నిఘా ఉంచింది.