Prathidhwani On New Government in Andhra Pradesh : కనుచూపు మేర ఎటు చూసినా కూటమి ప్రభంజనమే సృష్టించింది ఆంధ్రనాట. అధికార వైఎస్సార్సీపీ అయిదేళ్ల అరాచకం, అహంకారాన్ని అథఃపాతాళానికి తొక్కేశారు ప్రజలు. మాకొద్దీ దిక్కుమాలిన ప్రభుత్వం అన్న ప్రజల విస్పష్ట తిరస్కారంతో 8 ఉమ్మడి జిల్లాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేదు వైఎస్సార్సీపీ. మంత్రివర్గంలో ఒక్కరు మినహా మిగిలిన వారంతా మట్టిగొట్టుకుని పోయారు. అపూర్వ విజయం అందుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో నిమగ్నమైంది. మరి కొత్తగా కొలువుదీరబోతున్న ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లేంటి? ఒక్కఛాన్స్ అంటే ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారాన్ని పిచ్చోడి చేతిలో రాయి వాడి ఈ అయిదేళ్లల్లో ఏ ఏ శాఖల్లో ఏం చేశారు? ఆ పరిస్థితుల ప్రక్షాళన ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయనవేదిక కన్వీనర్ టి. లక్ష్మీ నారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ఏ. సురేష్.
ఐదేళ్ల అరాచక పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నెన్ని కుంభకోణాలు చేసిందో, ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసిందో లోతుల్లోకి వెళ్లి చూస్తేగానీ తెలియదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ కుంభకోణాలపై మీడియాకు, విపక్షాలకు తెలిసింది పైపైన మాత్రమేనని, అసలు విషయం లోతుల్లోకి వెళ్లి శోధిస్తేనే అర్థమవుతుందని అన్నారు. దీనికి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నాలుగైదు రోజుల సమయం పడుతుందన్నారు. వైఎస్సార్సీపీ రాక్షస పాలన అంతమవడంతో మీడియాకు ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించాయని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేసిందన్నారు.