GBS Cases in India : గులియన్ బారీ సిండ్రోమ్. దేశాన్ని, తెలుగు రాష్ట్రాలను కలవర పెడుతున్న పేరు ఇది. లేదు, రాదు అనుకుంటూ ఉండగానే ఈ అరుదైన వ్యాధి అన్నిచోట్ల చుట్టేస్తుండడమే అందుకు కారణం. ఒక్కొక్కటిగా నమోదవుతున్న మరణాలు కూడా భయాందోళనల్ని మరింత పెంచుతున్నాయి. నిజానికి ఇదేం కొత్తది కాదు. ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ అప్పట్లో లక్షలో ఒకరికో ఇద్దరిపైనా దాడిచేసేది ఇప్పుడు భారీగా విస్తరిస్తోంది. పెరుగుతున్న కేసులు వెంటిలేటర్ల వరకు వెళ్తున్న చికిత్సలు ప్రమాద తీవ్రత కళ్లకు కడుతున్నాయి.
ఇది అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సినదేనని వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఒకరకంగా పక్షవాతం లాంటిదే అని చెబుతున్నారు. చాలావరకు ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు వచ్చినవారికే మొదలవుతుందన్నారు. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయని పేర్కొంటున్నారు. వ్యాధి లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ప్రమాదకరం కాకముందే నయం చేయవచ్చని వివరిస్తున్నారు. ముఖ్యంగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుందని తెలియజేస్తున్నారు. పెద్దవారికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు చిన్నారులకు, శిశువులకూ సోకడం ఆందోళన కలిగిస్తోంది.
GBS Cases in AP : ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే ప్రమాదం సంభవిస్తుంది. ఇతర ఇన్‌ఫెక్షన్లు వచ్చినా, కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్నా, పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నా ఈ వ్యాధి సోకే అవకాశాలున్నాయి. దీన్ని ముందుగా నిరోధించలేం. కాళ్లు, చేతుల్లో బలహీనత కనిపిస్తే కొద్దివారాల ముందు విరేచనాలు, కడుపునొప్పి ఉన్నాయా అనేది చూడాలి. గులియన్ బారీ సిండ్రోమ్ లక్షణాలున్నాయని అనుమానిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. నర్వ్ కండక్షన్, ఎలక్ట్రోమయోగ్రఫీ, సీఎన్‌ఎఫ్, ఎంఆర్‌ఐ వంటి పరీక్షల ద్వారా వ్యాధిని వైద్యులు నిర్ధారిస్తారు.
మరి అసలేంటీ జీబీఎస్? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వ్యాపిస్తోంది? ఏ పరిస్థితుల్లో ప్రాణాల మీదకు వస్తుంది? అందుబాటులో ఉన్న చికిత్సలు, నివారణ మార్గాలేంటి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో జీజీహెచ్ న్యూరాలజీ విభాగాధిపతి డా.అరుణకుమారి , హైదరాబాద్ గాంధీ వైద్య కళాశాల క్రిటికల్ కేర్ మెడిసిన్ ప్రొఫెసర్ డా డా.కిరణ్ మాదాల పాల్గొన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం
భయపెడుతోన్న జీబీఎస్ - చిన్నారుల్లోనూ వైరస్ లక్షణాలు - ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఏపీలో 'జీబీఎస్' మరణం - జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మహిళ మృతి