Cleaning with Potatoes : పొటాటోతో టమాటా కర్రీ, ఫ్రై ఇలా ఏది చేసినా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అయితే, దాదాపు మనందరం బంగాళాదుంపలను వంటల్లోనే ఉపయోగిస్తాం. కానీ, వీటితో ఇంట్లోని వివిధ రకాల వస్తువులను శుభ్రం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్లీనింగ్ విషయంలో ఆలుగడ్డలను ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం.
మాడిపోతే ఇలా చేయండి!
కొన్నిసార్లు వంట చేసే క్రమంలో స్టవ్‌పైన వండుతున్న కూరల గురించి మర్చిపోతుంటాం. తర్వాత మాడిపోయిన వాసన వస్తే తెలుస్తుంది. స్టవ్‌పై ఏదో వండుతున్నాం అని! ఇలాంటప్పుడు మాడిపోయిన గిన్నెల మురికిని తొలగించడానికి బంగాళాదుంప చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం ముందుగా మందపాటి స్లైస్‌లా కట్ చేసిన ఆలూ ముక్కను నిమ్మరసంలో ముంచాలి. ఆపై పాత్రలో మాడిన ప్రదేశంలో రుద్దాలి. తర్వాత దాన్ని ఓ అరగంట పాటు అలాగే వదిలేయాలి. సబ్బు నీటితో నెమ్మదిగా రుద్ది కడిగేస్తే మాడిన గిన్నె తిరిగి మెరిసిపోతుంది.
వెండి మెరిపిద్దాం!
ఎన్ని జాగ్రత్తలు పాటించినా కొన్నిసార్లు గాలి తగిలి వెండి ఆభరణాలు నల్లగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు వాటిని మరిగే నీటిలో వేసి కడుగుతుంటారు చాలా మంది. అయితే దీనివల్ల అవి మెరవడం అటుంచితే వాటి సహజ మెరుపును కూడా కోల్పోతాయి. ఇలాంటప్పుడు బంగాళాదుంపలు మరిగించిన వాటర్‌తో వెండి వస్తువుల్ని క్లీన్ చేయడం మంచిదంటున్నారు నిపుణులు. అది కూడా వాటర్ బాగా వేడిగా, మరీ చల్లగా ఉండకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ నీటిలో ఆయా వెండి వస్తువుల్ని వేసి గంటపాటు వదిలేయాలి. ఆ తర్వాత బ్రష్‌తో శుభ్రం చేయాలి. పొటాటో నీళ్లలో ఉండే స్టార్చ్ నల్లగా మారిన వెండి ఆభరణాలు/వస్తువుల్ని కొత్తవాటిలా తిరిగి మెరిపిస్తుంది.
ఫ్రీజర్‌లో ఐస్ ఎక్కువగా పేరుకుపోతుందా? - ఈ టిప్స్ పాటిస్తే అస్సలు గడ్డకట్టదట!
పాత్రల తుప్పు మాయం!
సాధారణంగా వాతావరణంలోని తేమ కారణంగా ఐరన్, స్టీలు పాత్రలు తుప్పు పట్టడం మనం చూస్తుంటాం! అయితే దీన్ని వదిలించడానికి స్టీల్ స్క్రబ్బర్ ఉపయోగిస్తే పాత్ర త్వరగా పాతబడిపోతుంది. అలాగే మెరుపూ తగ్గిపోతుంది. ఇలా కాకుండా తుప్పుని వదిలించడానికి బంగాళాదుంపను ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ముందుగా ఆలూను మందపాటి స్లైసుల్లా కట్ చేసుకోవాలి. ఆపై ఒక స్లైస్‌ను గిన్నెలు తోమే సోప్ లిక్విడ్‌లో ముంచి లేదంటే బేకింగ్ సోడాలో అద్ది, తుప్పు ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి. తద్వారా తుప్పు వదిలిపోతుంది. అనంతరం డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో శుభ్రం చేసి పొడిగా తుడిచి ఆరబెడితే సరిపోతుంది.
ఇక తుప్పు పట్టిన కిచెన్‌లోని కత్తులపై బంగాళాదుంప ముక్కతో రుద్ది ఓ 5 నిమిషాలపాటు పక్కన పెట్టేయాలి. అనంతరం సాధారణ నీటితో కడిగి పొడిగా తుడిచేస్తే ఫలితం ఉంటుంది.
మరకలు మాయం!
కొన్నిసార్లు అనుకోకుండా దుస్తులు, కార్పెట్స్‌పై టమాటా కెచప్, టీ, కాఫీ వంటి మరకలు పడుతుంటాయి. ఇవి ఎంత రుద్దినా ఓ పట్టాన వదలవు. అలాంటప్పుడు ఒక చిన్న బంగాళాదుంప స్లైస్ తీసుకొని మరక పడిన చోట బాగా రుద్దాలి. అనంతరం బంగాళాదుంపలు ఉడికించిన నీటిని దానిపై పోయాలి. ఆపై క్లాత్‌ను ఓ అరగంట పాటు పక్కన పెట్టేయాలి. అనంతరం సాధారణంగా సబ్బు నీటితో ఉతికేస్తే మరక తొలగిపోవడం మనం గమనించచ్చు. ఇలా కాదనుకుంటే పొటాటో ఉడికించిన నీటిలో స్పాంజిని ముంచి కూడా మరక పడిన చోట రుద్దచ్చు. తద్వారా కూడా మరక తొలగిపోతుంది.
ఇలా కూడా!
- ఇంట్లోని చెక్క వస్తువులు/ఉడెన్ ఫర్నిచర్‌ని క్లీన్ చేయడానికీ బంగాళాదుంపను ఉపయోగించచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో కొద్దిగా వెనిగర్, టీస్పూన్ ఉప్పు, తురిమిన ఆలూ కొద్దిగా తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమంలో స్పాంజిని ముంచి చెక్క ఫర్నిచర్‌ని తుడిచేస్తే అవి తళతళా మెరిసిపోతాయి.
- లెదర్ షూస్, బ్యాగుల వంటివి త్వరగా దుమ్ము పట్టేస్తుంటాయి. దీంతో అవి చూడడానికి మురికిగా కనిపిస్తాయి. అలాంటప్పుడు బంగాళాదుంప ముక్కతో వాటిని రుద్ది ఓ 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి. తర్వాత శుభ్రమైన కాటన్ వస్త్రంతో మరోసారి వాటిని తుడిచేస్తే సరిపోతుంది. ఇలా పొటాటోలను వంటింట్లో చాలా రకాలుగానూ ఉపయోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.