Lok Sabha Polls 2024 Gujarat BJP : భారతీయ జనతా పార్టీ కంచుకోట గుజరాత్ ఈ రాష్ట్రంలో 1998 ఎన్నికల్లో ఆరంభమైన కమలం పార్టీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 26 సీట్లు ఉండగా 26 స్థానాలు గెలుచుకుని కమలనాథులు చరిత్ర సృష్టించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. మరోసారి మోదీ, షా సొంతగడ్డపై అన్ని లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది.
ఇప్పటికే బోణీ!
2017 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కమలం పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. కానీ తర్వాత చతికిలపడింది. అప్పట్నుంచీ కోలుకోలేకపోయింది. మూడో విడతలో మే 7వ తేదీన 25 నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఏకగ్రీవమైన సూరత్ స్థానాన్ని కమలం తన ఖాతాలో వేసుకుంది. మిగతా 25 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుండగా పొత్తులో భాగంగా 24 సీట్లలో కాంగ్రెస్, 2 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ చేస్తున్నాయి.
తొలి అడుగు బలంగా!
ఈసారి కూడా గుజరాత్‌లో క్లీన్ స్వీప్ చేసే దిశగా కమలనాథులు తొలి అడుగు బలంగా వేశారు. పోలింగ్‌కు ముందే సూరత్ లోక్‌సభ నియోజకవర్గంలో తొలి విజయాన్ని నమోదు చేశారు. బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి సంతకాలు చేసిన ముగ్గురు ప్రతిపాదకులు తమ సంతకాలను ఫోర్జరీ చేశారని అడ్డం తిరగడం వల్ల ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులతో బీజేపీ మాట్లాడి ఉపసంహరింపజేసింది. దీంతో ఈ సీటు ఏకగ్రీవమైంది. మరోవైపు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నీలేశ్‌ను బహిష్కరించింది.
బీజేపీకి అండగా!
8 లోక్‌సభ నియోజకవర్గాలున్న సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం బీజేపీకు అండగా నిలుస్తోంది. గుజరాత్‌లో పటేల్‌లు బీజేపీకు గట్టి మద్దతుదారులుగా ఉండడం వల్ల ఆ పార్టీ సునాయాస విజయాలను నమోదు చేస్తోంది. ఈ ఎన్నికల్లోనూ హిందుత్వతోపాటు బీజేపీ సోషల్ ఇంజినీరింగ్ పనిచేసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థులపై కొన్ని చోట్ల అసంతృప్తి ఉంది. అమ్రేలీ, రాజ్‌కోట్, సాబర్ కాంఠా, సురేంద్రనగర్, వడోదరాలో అభ్యర్థుల ఎంపిక తీరును బీజేపీలోని కొన్నివర్గాలు, ఓటర్లు తప్పుబడుతున్నారు. ఈ అసంతృప్తులను మోదీ బ్రాండ్, సైద్ధాంతిక మద్దతు వంటి అంశాల ద్వారా బీజేపీ అధిగమించగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.