Lok Sabha Election 2024 Kerala :సార్వత్రిక ఎన్నికల సమరంలో 400 స్థానాలు గెలవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని NDA ప్రణాళికలను రచిస్తోంది. కమల దళం ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం 50 స్థానాలను NDA కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రధాని మోదీ దక్షిణాదిన సుడిగాలి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాదిన NDA వికాసం కనిపిస్తున్నా దక్షిణాదిన కొన్ని రాష్ట్రాలు బీజేపీకి కొరకరాని కొయ్యగా మారాయి. అందులో ముఖ్యమైన రాష్ట్రం కేరళ. కేరళలో దశాబ్దాలుగా వామపక్షాల నేతృత్వంలోని LDF, కాంగ్రెస్ నేతృత్వంలోని UDF స్పష్టమైన ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కూడా కేరళలో సత్తా చాటి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఈ కూటములు వ్యూహ రచన చేస్తున్నాయి.
NDA బలమైన సవాల్
LDF, UDF కూటములకు ప్రధాని మోదీ నాయకత్వంలోని NDA బలమైన సవాల్ విసురుతోంది. చాలా లోక్‌సభ నియోజకవర్గాల్లో గతంలో ద్విముఖ పోరుగా ఉండే పరిస్థితి నేడు త్రిముఖ పోరుగా మారింది. ఇలా త్రిముఖ పోరుగా మారడం కేరళలో సాంప్రదాయ పార్టీల ఆధిపత్యానికి గండి పడడమే అని NDA వర్గాలు చెప్తున్నాయి. LDFలో సీపీఎం, సీపీఐ, కేరళ కాంగ్రెస్ ప్రధాన భాగస్వాములుకాగా UDFలో కాంగ్రెస్, ముస్లిం లీగ్ సహా కొన్ని ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని NDAతో భారత ధర్మ జన సేన పొత్తు పెట్టుకుంది. ఏప్రిల్ 26న కేరళలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
హోరాహోరీ పోరు తప్పదు!
కేరళలో జాతీయ స్థాయి నిర్ణయాలు, సమస్యలే ప్రధాన ప్రచార అస్త్రాలుగా మారాయి. సంక్షేమ పథకాలు సానుకూల ఫలితాలను ప్రజలకు చెప్తూ NDA ప్రచారంలో దూసుకుపోతుంటే పౌరసత్వ సవరణ చట్టం, ఎలక్టోరల్ బాండ్ వివాదాలు, మణిపూర్ అల్లర్లపై అధికార LDF, విపక్ష UDF విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కేరళలో హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు.
బీజేపీ ఇలా - కాంగ్రెస్ అలా
కేరళలోని మొత్తం ఓటర్లలో 50 శాతం మంది మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఈ ఓట్లతో కేరళలో విజయం సాధించేందుకు UDF ప్రణాళికలు రచిస్తోంది. UDFలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML కూడా భాగస్వామ్యంగా ఉంది. యూత్ కాంగ్రెస్, IUML సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేశాయి. ఈ అంశాలు కాంగ్రెస్‌కు కలిసిరానున్నాయి. కానీ కాంగ్రెస్ కేరళ చీఫ్ సుధాకరన్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ల మధ్య వర్గ విభేదాలు, సమన్వయ లోపం స్థానిక నేతలు బీజేపీలో చేరడం వంటి అంశాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారాయి.
2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి కేరళలోని మొత్తం 20 స్థానాలకుగానూ 19 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, శాసనసభ ఎన్నికల్లో UDF కూటమి విఫలమైంది. ఈసారి త్రిసూర్‌లో మినహా దాదాపు అందరు సిట్టింగ్ ఎంపీలను UDF బరిలోకి దించగా, లెఫ్ట్ పార్టీ సీనియర్ నేతలైన కె.కె. శైలజ, థామస్ ఐజాక్, ఎలమరామ్ కరీంలను రంగంలోకి దింపింది. 2019 ఎంపీ ఎన్నికల్లో వయానాడ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బరిలో నిలవడం UDFకు బలం చేకూర్చింది. ఇటీవల పుత్తుపల్లి, త్రిక్కకర అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ విజయం సాధించడం కూడా హస్తం పార్టీ బలాన్ని మరింత పెంచింది.
2016 నుంచి కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు కలిసిరానుంది. కాంగ్రెస్‌కు మైనారిటీల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర ఆరోపణలు కూడా హస్తం పార్టీకి కలిసిరానున్నాయి. అయితే మహిళలకు సీట్లు కేటాయించకపోవడం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. మొత్తం 20 స్థానాలు ఉండగా కేవలం ఒకే సీటును UDF మహిళకు కేటాయించింది. ఎన్నికలకు ముందు స్థానిక కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి ఫిరాయించడం కూడా కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది.