PratidhwaniOn Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై పేదలు, మధ్యతరగతి, వ్యాపారవర్గాలు అశలు పెంచుకున్నాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన మోదీ సర్కారు.. ఈసారి రైతులు, మహిళలు, ఉద్యోగ వర్గాలకు తాయిలాలు అందించవచ్చన్న అంచనాలున్నాయి. భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంతో సాగుతున్న కేంద్రం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో సామాన్యులు, వేతన జీవులకు కేంద్రం ఎలాంటి వరాలు ప్రకటించవచ్చు? స్టార్టప్ కంపెనీల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు లభించే ప్రోత్సాహకాలేంటి? సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం ఆర్థికంగా ఎలాంటి మద్దతు ప్రకటిస్తుందో చూడాలి.
సీతారామన్ ఈసారి సమగ్ర పద్దును ప్రకటించనున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరిలో వెలువరించిన ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో రైతులు, పేదలను ఆకట్టుకునే తరహాలో కొన్ని ప్రకటనలు చేశారు. సేవలు, ఇతర రంగాల అభివృద్ధికి కేటాయింపులు చేసినప్పటికీ కొన్ని రంగాల వారు మధ్యంతర బడ్జెట్ విషయంలో నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అందరి చూపు పూర్తిస్థాయి బడ్జెట్‌పైనే ఉంది. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి, వ్యాపార వర్గాల నుంచి భారీగానే అంచనాలు వినిపిస్తున్నాయి.