Dhanteras Jewellery Sales 2024 : ఈ దీపావళి వేళ రత్నాలు, బంగారు, వెండి ఆభరణాలకు దేశంలో భారీగా డిమాండ్ పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగానే రేట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దీపావళి, ధంతేరాస్‌కు ఏకంగా రూ.30,000 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారతీయులు బంగారాన్ని ఒక నమ్మదగిన ఆస్తిగా చూస్తుంటారు. కనుక దీనికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. బంగారంతో పోల్చితే, వెండి ధర తక్కువగానే ఉంటుంది. కానీ పారిశ్రామిక డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. కొంత మంది నిపుణుల ప్రకారం, ఈ దీపావళికి దేశవ్యాప్తంగా రత్నాలు, బంగారు ఆభరణాల అమ్మకాల్లో విలువపరంగా 10-15 శాతం వరకు వృద్ధి కనిపించవచ్చు.
స్టాక్ మార్కెట్ రాబడులను మించి!
మన దేశంలో స్టాక్ మార్కెట్ రాబడులతో పోల్చి చూస్తే, వెండి ఏకంగా 40 శాతం ఎక్కువ ఆదాయాన్ని అందిస్తోంది. షేర్ మార్కెట్ కంటే బంగారం 23 శాతం అధికంగా రాబడిని అందిస్తోంది.
జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) ఈస్ట్రన్ రీజినల్ ఛైర్మన్ మాట్లాడుతూ, "ప్రపంచ అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిత్తకలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారానికి బాగా డిమాండ్ పెరుగుతోంది. సరసమైన ధరకు లభించే వెండికి కూడా భారీగా గిరాకీ పెరుగుతోంది" అన్నారు.
వజ్రాలకు తగ్గుతున్న డిమాండ్
ఒకప్పుడు నాచురల్ డైమండ్స్‌కు బాగా గిరాకీ ఉండేది. కానీ నేడు ల్యాబరేటరీల్లోనే కృత్రిమంగా వజ్రాలను తయారు చేస్తున్నారు. ఇవి తక్కువ ధరకే లభిస్తుండడం వల్ల ప్రజలు వీటిని కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఇలాంటి కృత్రిమ వజ్రాలు కొనడం ఇష్టంలేని వారు, నాచురల్ డైమండ్స్ కంటే, కాస్త తక్కువ ధరకు లభించే బంగారాన్ని కొనడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వజ్రాల నుంచి బంగారం వైపునకు డిమాండ్ మారడాన్ని కౌన్సిల్ గుర్తించింది.
దిగుమతి సుంకాలు తగ్గితే!
'భారత్‌లో జ్యువెలరీ మార్కెట్ సుస్థిరతను పెంచాలంటే, దిగుమతి సుంకాలు తగ్గించాలి. ఇందుకోసం పరిశ్రమ తన వంతు కృషి చేయాలి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని కీలక చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు బంగారం దిగుమతులపై విధిస్తున్న సుంకాన్ని 15 శాతం నుంచి 9 శాతానికి తగ్గించాలి. అప్పుడే గోల్డ్ మార్కెట్ వృద్ధి జరుగుతుంది' అని అంకురహతి జెమ్స్ అండ్ జ్యువెలరీ మాన్యుఫ్యాక్చురర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ బెంగానీ అభిప్రాయపడ్డారు.
'ఈ దీపావళి, ధంతేరాస్‌కు పరిమాణంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, రత్నాలు, బంగారు, వెండి అభరణాల అమ్మకాలు మాత్రం రూ.30,000 కోట్లు దాటవచ్చు' అని అశోక్ బెంగానీ అంచనా వేస్తున్నారు.
రివర్స్ ఎఫెక్ట్
సెన్కో గోల్డ్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ సువాన్కర్ సేన్ అంచనా ప్రకారం, "ఈ ఏడాది బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉన్నందున, పరిమాణంలో 12-15 శాతం వరకు క్షీణత ఉండే అవకాశం ఉంది. కానీ విలువ పరంగా చూస్తే 10-12 శాతం వరకు అమ్మకాల విలువ పెరుగుతుంది."
వాటికి భారీగా డిమాండ్
తక్కువ స్వచ్ఛత కలిగిన (9 క్యారెట్), తేలికపాటి బంగారు ఆభరణాలకు శ్రామిక వర్గానికి చెందిన మహిళల నుంచి భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని సువాన్కర్ పేర్కొన్నారు.
భారత్‌లో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా చూస్తారు కనుక దీనికి బాగా డిమాండ్ పెరుగుతుందని అంజలి జ్యువెలర్స్‌కు చెందిన అనర్ఘ ఉత్తియా చౌదరి అభిప్రాయపడ్డారు.
"ఈ దీపావళికి చాలా మంది తమ వ్యక్తిగత అవసరాలకు, అభిరుచులకు అనుగుణమైన నగలను ఎంచుకుంటారు. మరికొందరు పెళ్లిళ్లు లాంటి శుభకార్యాల కోసం ఆభరణాలు కొంటారు. ఇంకొందరు తక్కువ ధరకు లభించే లైట్‌వెయిట్ బంగారాన్ని, ముక్కలను కొంటుంటారు. ఇక పురుషులు కూడా బ్రాస్‌లెట్‌లు, ఉంగరాలు, ఇయర్ స్టడ్స్ లాంటివి బాగా కొంటున్నారు" అని అనర్ఘ ఉత్తియా చౌదరి పేర్కొన్నారు.
ధరలు పెరిగినా డిమాండ్ తగ్గదు!
బంగారం ధరలు ఎంత పెరిగినప్పటికీ, అమ్మకాలు 10-20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని స్వర్ణ శిల్పా బచావో కమిటీ అధ్యక్షుడు బబ్లూ దే ఆశాభావం వ్యక్తం చేశారు.
"ఈ ఏడాది వ్యాపారం మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే, బంగారం ధర పెరుగుతుంటే, అది భవిష్యత్‌లో మరింత పెరుగుతుందని మదుపరులు విశ్వసిస్తుంటారు" అని బబ్లూ దే అన్నారు.
బంగారం కంటే వెండికే అధిక డిమాండ్
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) భవిష్యత్‌లో బంగారం కంటే వెండికి బాగా డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది. బంగారం లాగానే వెండిని కూడా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా మదుపరులు భావిస్తారు. దీనికి తోడు వెండికి పారిశ్రామిక డిమాండ్ కూడా పెరుగుతోంది. కనుక 12-15 నెలల్లో MCXలో వెండి ధర రూ.1,25,000 వరకు పెరిగే అవకాశం ఉందని 'మోతీలాల్ ఓస్వాల్' అభిప్రాయపడింది. అలాగే బంగారం ధరలు మధ్యస్థ కాలానికి రూ.81,000 వరకు చేరుకోవచ్చని, కానీ దీర్ఘకాలంలో బంగారం ధరలు రూ.86,000 వరకు పెరగవచ్చని అంచనా వేసింది.
"ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలోని అనిశ్చిత పరిస్థితులు, రూపాయి క్షీణత, కీలక వడ్డీ రేట్లు తగ్గింపు మొదలైనవి బంగారం, వెండి లాంటి వాటికి డిమాండ్ పెరగడానికి కారణమయ్యాయి" అని మోతీలాల్ ఓస్వాల్ కమోడిటీ రీసెర్చ్ గ్రూప్ సీనియర్ వీపీ నవనీత్ దమానీ చెప్పారు.
వజ్రాలకు కూడా డిమాండ్
"వివిధ వర్గాల ప్రజలు వజ్రాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లళ్ల సీజన్‌లో, పండుగ సీజన్‌లో ఈ డిమాండ్ బాగా ఉంటుంది. కొత్త సంవత్సరంలోనూ ఇదే విధంగా డిమాండ్ ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం" అని డి బీర్స్ ఇండియా ఎండీ అమిత్ ప్రతిహారి అన్నారు.