CM Serious on Wine Shops: మద్యం ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ఉపేక్షించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఎమ్మార్పీ ఉల్లంఘించి, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే దుకాణాలకు మొదటి తప్పు కారణంగా రూ.5 లక్షల జరిమానా విధించాలని సూచించారు. తర్వాత కూడా మళ్లీ అవే తప్పులు చేస్తూ నిబంధనల్ని ఉల్లంఘిస్తే లైసెన్సు పూర్తిగా రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో గనులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు.
ఇసుక లభ్యత, సరఫరా, మద్యం ధరలపై అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపుల్ని అనుమతించొద్దని చెప్పారు. మద్యం దుకాణాల యజమానులు బెల్ట్ షాపుల్ని ప్రోత్సహించినా, ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి దుకాణం వద్ద సీసీ కెమెరాలు, ధరల వివరాల్ని తెలియజేస్తూ ధరల బోర్డులు కచ్చితంగా ఉండాలి. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయండి. ఆకస్మిక తనిఖీలతో అక్రమంగా విక్రయించే బెల్ట్ షాపులకు కళ్లెం వేయాలని చంద్రబాబు తెలిపారు.
ముందు అధికారుల పైనే చర్యలు : ఇసుక విషయంలో తప్పులు జరిగితే అధికారుల పైనే ముందుగా చర్యలు తీసుకుంటామని, ఉల్లంఘనలకు వారే బాధ్యత వహించాలని చంద్రబాబు హెచ్చరించారు. ఇసుక లభ్యత పెంచి రీచ్‌ల వద్దకు సులభంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా వెళ్లడానికి వీల్లేకుండా ఇసుక, మద్యం విధానాల్లో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉంది.
ఇది క్షేత్రస్థాయి వరకు సక్రమంగా అమలయ్యేలా చూడాలి. ప్రజల ఆదాయాన్ని దోచుకునేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించొద్దు’ అని చంద్రబాబు సూచించారు. వీటి పర్యవేక్షణకు త్వరలో సెంట్రల్ మానిటరింగ్ సిస్టం (సీఎమ్ఎస్) ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఇటీవల మద్యం టెండర్లను పిలిచి పాత పాలసీని కూటమి ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. దీంతో మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తులు నిర్వహించేందుకు అవకాశం కల్పించింది. ఇకపోతే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీతో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.