ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / opinion

దక్షిణ కర్ణాటకలో ఆసక్తికర పోరు- బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్​ ఫైట్​- గెలుపు ఎవరిదో? - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Congress Vs BJP In South Karnataka : రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న 14 నియోజకవర్గాలకు ఈ నెల 26వ తేదీన తొలి విడత పోలింగ్‌ జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్యే ద్విముఖ పోరు నెలకొంది. జేడీఎస్​తో కలిసి బీజేపీ బరిలోకి దిగగా, కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. దక్షిణ కర్ణాటక ప్రాంతంలో భిన్నమైన పరిస్థితుల కారణంగా పార్టీలు ఈ ప్రాంతం కోసం ప్రత్యేకమైన వ్యుహాలు రచించి అములు చేస్తుంటారు.

Congress Vs BJP In South Karnataka
Congress Vs BJP In South Karnataka
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 7:20 AM IST

Congress Vs BJP In South Karnataka : దేశవ్యాప్తంగా రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న 14 నియోజకవర్గాలకు ఏప్రిల్ 26వ తేదీన తొలి విడత పోలింగ్‌ జరగనుంది. ఈ లోక్​ సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య ద్విముఖ పోరు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన బీజేపీ, జేడీఎస్‌ కలిసి బరిలోకి దిగాయి. కాంగ్రెస్‌ ఒంటరిగానే నిలిచింది. భౌగోళిక, సామాజిక పరిస్థితుల పరంగా చూస్తే ఉత్తర కర్ణాటకకు భిన్నమైనది దక్షిణ కర్ణాటక ప్రాంతం. ఇక్కడ ఎన్నికలపై ప్రభావం చూపే అంశాలూ కూడా భిన్నంగానే ఉంటాయి. అందుకే పార్టీలు ఈ ప్రాంతానికి ప్రత్యేక వ్యూహాలు రచిస్తుంటాయి.

రెండో విడతో పోలింగ్ జరగనున్న నియోజక వర్గాలు
ఉడుపి-చిక్కమగళూరు, హాసన, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ (ఎస్‌సీ), తుమకూరు, మండ్య, మైసూరు-కొడగు, చామరాజనగర (ఎస్‌సీ), బెంగళూరు గ్రామీణం, బెంగళూరు ఉత్తర, బెంగళూరు కేంద్ర, బెంగళూరు దక్షిణ, చిక్కబళ్లాపుర, కోలారు (ఎస్‌సీ)

కొత్తవారి జోరు
పొత్తు కారణంగా బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తోంది. కోలారు, హాసన, మండ్య స్థానాల్లో జేడీఎస్‌ అభ్యర్థులకు ఇచ్చింది. ఇందులో 8 మంది సిటింగ్‌లను పక్కనబెట్టింది. ఉడుపి- చిక్కమగళూరు సిటింగ్‌ ఎంపీ శోభా కరంద్లాజెను బెంగళూరు ఉత్తరకు మార్చింది. మొత్తం 10 స్థానాల్లో కొత్తవారు పోటీ చేస్తుండగా, నలుగురు సిటింగ్‌లు మరోసారి బరిలో దిగారు.

ప్రభావిత అంశాలు
2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 5 గ్యారంటీ పథకాలే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రధాన బలం. రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్యారంటీలను అమలు చేసిన ఆ పార్టీకి ప్రధాని మోదీ ప్రభావం ఎప్పటిలాగే గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్రంగా నెలకొన్న కరవు పరిస్థితులు బీజేపీకి అడ్డంకిగా మారే ప్రమాదం లేకపోలేదు. కరవు పరిహారం కోసం రాష్ట్ర సర్కారు పలుమార్లు కేంద్రాన్ని సంప్రదించినా ఇంతవరకూ సాయం చేయలేదని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నిధులు, జీఎస్‌టీ పరిహారం చెల్లించలేదని చెబుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నివేదికలు ఇవ్వలేదని, రాష్ట్రానికి చెల్లించాల్సిన నిధుల ప్రస్తావన ఆర్థిక సంఘం తుది నివేదికలో లేదని కేంద్ర సర్కారు వాదిస్తోంది. ఈ అంశాలే ప్రచారంలో కీలకంగా మారాయి.

బెంగళూరుకు తాగునీరు లేకున్నా తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయడం, ఇక్కడి మౌలిక సదుపాయాలు, పాత మైసూరు ప్రాంతంలోని 4 స్థానాల్లో జేడీఎస్‌, బీజేపీ పొత్తు, ఒక్కలిగ ఓటర్లు, బెంగళూరులో బాంబుల మోత, హిందువులపై దాడులు ఈ అంశాలు ప్రస్తుతం ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.

కీలక నియోజకవర్గాల్లో ద్విముఖ పోరు
కోలార్​ నియోజకవర్గంలో మొత్తం 16,31,850మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న ప్రాంతమే అయినా 2019లో బీజేపీ గెలిచింది. ఇక్కడి నుంచి గతంలో 6సార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి కేహెచ్‌ మునియప్ప గత ఏడాది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ లోక్​సభ ఎన్నికల్లో టికెట్‌ తన అల్లుడికి ఇప్పించుకోవాలని ఆయన చివరి వరకూ పోరాడినా పార్టీలో విభేదాల కారణంగా బయటి వ్యక్తికి దక్కింది. బెంగళూరుకు చెందిన కేవీ గౌతమ్‌కు టికెట్‌ ఇచ్చారు. దీంతో ఆయనకు మునియప్ప వర్గం నుంచి మద్దతు కరవైంది. మరోవైపు జేడీఎస్‌ నుంచి అంతగా పేరులేని మల్లేశ్‌ బాబుకు టికెట్‌ దక్కింది. సిటింగ్‌ ఎంపీ మునిస్వామితోపాటు బీజేపీ నేతల మద్దతుపై ఆయన గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. తాగునీరు, నిలిచిపోయిన బంగారు గనుల తవ్వకం, ఉపాధి, కాలుష్యం, మౌలిక వసతులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.

అభ్యర్థులిద్దరూ ఒక్కలిగలే
కాంగ్రెస్‌, బీజేపీల్లోని కీలక నేతల వ్యక్తిగత ప్రతిష్ఠకు బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం వేదిక. ఇక్కడ గత 17 ఎన్నికల్లో 13 సార్లు కాంగ్రెస్‌, 3 సార్లు జేడీఎస్‌, ఒకసారి బీజేపీ గెలిచాయి. అభ్యర్థులిద్దరూ ఒక్కలిగ వర్గానికి చెందినవారు కావడం వల్ల పోరు ఆసక్తికరంగా మారింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌తో మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు మంజునాథ్‌ పోటీ పడతున్నారు. రాజకీయ అనుభవం లేకపోవడం మంజునాథ్‌ బలహీనత కాగా, మోదీ ప్రభావం కాంగ్రెస్‌ అభ్యర్థికి అడ్డంకిగా మారనుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 27,63,910 ఓటర్లు ఉన్నారు.

బరిలో మైసూరు మహారాజు
మైసూరు మహారాజుల వంశస్థుడు, సాధారణ కార్యకర్త మధ్య ఇక్కడ పోటీ నెలకొంది. మైసూరు యువరాజు యదువీర్‌ ఒడెయార్‌ స్వయంగా బరిలోకి దిగడం వల్ల ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత జిల్లా కావడం వల్ల ఈ స్థానంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దాదాపు 4.7 లక్షల మంది ఒక్కలిగలున్న ఈ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ 47ఏళ్ల తర్వాత ఆ వర్గానికి టికెట్‌ ఇచ్చింది. రాజ వంశీకులు సాధారణ రాజకీయ నేతగా రాణిస్తారా అని ఓటర్లింకా సంశయంతోనే ఉన్నా అవినీతికి పాల్పడక పారదర్శకంగా వ్యవహరిస్తారన్న విశ్వాసం ప్రజలకు ఉండటం యదువీర్‌ బలం. మైసూరు నియోజకవర్గంలో 20,92,222 మంది ఓటర్లు ఉన్నారు.

బరిలో రాజకీయ నేతల వారుసులు
జేడీఎస్‌ అధినేత దేవెగౌడ రాజకీయ పుట్టిల్లుగా పరిగణించే హాసనలో పోటీ రసవత్తరంగా మారింది. ఇదే స్థానం నుంచి వరుసగా 5 సార్లు గెలిచిన దేవెగౌడ 2019లో మనవడి కోసం త్యాగం చేశారు. ఈసారి ప్రజ్వల్‌ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. దేవెగౌడతో గతంలో పోటీ పడిన పుట్టస్వామి గౌడ మనవడు శ్రేయస్‌ పాటిల్‌ తలపడుతున్నారు. ఇలా ఇద్దరు రాజకీయ నేతల వారసులు ఈసారి పోటీ చేస్తుండటం వల్ల ఆసక్తికరంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌ సాధించిన ఏకైక స్థానం హాసనే. ఇక్కడ బీజేపీ, జేడీఎస్‌ కార్యకర్తలు బద్ధ శత్రువులుగా ఉంటారు. ఈ పార్టీలు ఇప్పుడు మిత్రులుగా మారడం వల్ల పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ రెండు పార్టీల కుమ్ములాట నుంచి కాంగ్రెస్‌ లాభపడే అవకాశం లేకపోలేదు. మొత్తం 17,24,908 మంది ఓటర్లు ఈ నియోజక వర్గంలో ఉన్నారు.

ప్రధాని మోదీపై ఈసీకి మళ్లీ కాంగ్రెస్ ఫిర్యాదు- చర్యలు ఉంటాయా? - Lok Sabha Elections 2024

పెళ్లికి వెళ్తున్న మంత్రిపై దాడి- ముక్కుకు గాయమయ్యేలా కొట్టిన గ్రామస్థులు! - Attack On UP Minister

ABOUT THE AUTHOR

...view details