Congress Unemployment Guarantees : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు జాతీయ నేతలతో పాటు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఏఐసీసీ కార్యదర్శులకు లేఖలు రాసింది అధిష్ఠానం. వారి రాష్ట్రాల్లో మార్చి 8, 9 తేదీల్లో మీడియా సమావేశాలు నిర్వహించి రాహుల్ ప్రకటించిన ఐదు హామీలను ప్రజలకు వివరించాలని సూచించింది. దేశంలోని ప్రతి మూలకు ఐదు హామీలను తీసుకెళ్లాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారు.
"దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువకుల పాత్ర కీలకం. ఈ విషయాన్ని అర్థం చేసుకుని నిరుద్యోగం, సామాజిక భద్రత సమస్యలపై దృష్టి సారించాం. దేశంలో యువకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోదీ 2014లో అధికారంలోకి వచ్చారు. కానీ తర్వాత ఆ హామీని పట్టించుకోలేదు. ఇప్పుడు మేము ఉద్యోగాల అంశాన్ని తీసుకువస్తే, దృష్టి మార్చేందుకు పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నారు. గత 45 ఏళ్లను గమనిస్తే ఇదే అత్యధిక నిరుద్యోగ రేటు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలే ఈ పరిస్థితికి కారణం. ఉపాధి లేకపోవడం వల్ల యువత నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు లేక మన దేశ యువత సుమారు 10 గంటలపాటు సోషల్ మీడియాలోనే ఉంటుందని రాహుల్ గాంధీ ఇప్పటికే చెప్పారు. ఈ ఐదు హామీలు యువతను మా పార్టీవైపు తిప్పుతాయి."
--అభిషేక్ దత్, ఏఐసీసీ కార్యదర్శి
భారత్ జోడో న్యాయ్‌యాత్ర మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశించగా, బాన్స్‌వారాలో నిర్వహించిన సభలో ఐదు హామీలను ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే దేశవ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. డిప్లొమా/ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువతకు అప్రంటీస్‌షిప్ శిక్షణ ఇప్పించి వారిలో నైపుణ్యాన్ని కల్పిస్తామన్నారు. అప్రంటీస్‌షిప్ హక్కు చట్టాన్ని తీసుకురావడం ద్వారా 25 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారికి శిక్షణ కల్పించి ప్రభుత్వ/ ప్రైవేటురంగంలో ఉపాధి లభించేలా చూస్తామన్నారు. ఉద్యోగ నియామక పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీలను అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని అమలుచేస్తామని హామీ ఇచ్చారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామని తెలిపారు. అలాగే, స్టార్టప్‌ల కోసం రూ.5వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేసి జిల్లాల వారీగా పంపిణీ చేస్తామని వివరించారు. యువత సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందన్నారు. 30లక్షల ఉద్యోగాల భర్తీపై నమ్మకాన్ని కల్పించేందుకు పూర్తి సమాచారంతో వివరణ ఇచ్చింది కాంగ్రెస్.
ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ
- కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 9లక్షలు
- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2లక్షలు
- ఆరోగ్య శాఖలో 1.6లక్షలు
- 1.76లక్షల అంగన్వాడీ కార్మికులు
- కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో 16,329
- రాష్ట్ర పాఠశాలల్లో 8.3లక్షల
- ఉన్నత విద్యాసంస్థల్లో 18,000
- ఐఐటీ, ఐఐఎమ్, నిట్ లాంటి సంస్థల్లో 16,687
- ఆర్మీలో లక్ష, కేంద్ర సాయుధ బలగాల్లో 91,929
- రాష్ట్ర పోలీసు శాఖల్లో 5.3లక్షలు
- సుప్రీం కోర్టులో 4, హైకోర్టులో 419
- జిల్లా స్థాయి, దిగువ కోర్టుల్లో 4,929
అమేఠీపైనే అందరి దృష్టి
మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వయనాడ్ స్థానం పోటీ చేస్తుండడం వల్ల ఇప్పుడు అందరి దృష్టి అమేఠీకి మళ్లింది. తొలి జాబితాను ప్రకటించకముందు రాహుల్, ఈసారి అమేఠీ నుంచే బరిలో దిగుతున్నారని జోరుగా ప్రచారం సాగింది. కానీ, వాటన్నింటికి చెక్ పెడుతూ కేరళలోని వయనాడ్ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు రాహుల్. మరోవైపు అమేఠీ అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల అక్కడ కూడా పోటీ చేస్తారా అన్న సందేహం వస్తుంది. దక్షిణ, ఉత్తర భారతాన్ని సమతూకం చేసేందుకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో లాగా రెండు స్థానాల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.